తెలంగాణ

telangana

ETV Bharat / city

మోసేందుకు బరువులు లేక రైల్వే కూలీల బతుకు భారం - telangana latest news

బరువులు మోసే రైల్వే కూలీలకు... బతుకు భారంగా మారింది. రైలుబండి నడిస్తేనే... వారి బతుకు బండి ముందుకుకదిలే పరిస్థితి. ఏడాదిగా రైళ్లు సరిగా నడవక ఆదాయం లేక దీనావస్థలో కొట్టుమిట్టాడతున్నారు. ఎంత బరువైనా అవలీలగా మోసే కూలీలు.. ప్రస్తుతం కుటుంబభారం మోయలేక చతికిలపడిపోతున్నారు.

The lives of railway labor  have become miserable under the influence of the corona
మోసేందుకు బరువులు లేక రైల్వే కూలీల బతుకు భారం

By

Published : May 26, 2021, 4:52 AM IST

Updated : May 26, 2021, 5:46 AM IST

మోసేందుకు బరువులు లేక రైల్వే కూలీల బతుకు భారం

కరోనా ప్రభావంతో రైల్వే కూలీల బతుకులు దుర్భరంగా మారిపోయాయి. ఎప్పుడూ రైల్వేస్టేషన్లలో గుంపులు గుంపులుగా ఉండే రైల్వే కూలీలు... ఇప్పుడు స్టేషన్‌ బయట దిగాలుగా కూర్చుంటున్నారు. కొవిడ్‌ కట్టడిలో భాగంగా రైల్వేశాఖ ఎక్కువశాతం ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేయడంతో కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. పూట గడవక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంటి అద్దె కట్టేందుకు డబ్బులు లేక అష్టకష్టాలు పడుతున్నారు. షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తుండటం వల్ల ఒక్కొక్కరికి నెలలో వారం రోజులు మాత్రమే పని దొరుకుతోంది. మిగిలిన రోజుల్లో వేరే పనులకు వెళ్దామన్నా లాక్‌డౌన్ వల్ల.. ఎక్కడా దొరకని పరిస్థితి నెలకొంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు వెయ్యికి పైగా రైల్వే కూలీల పరిస్థితి ఇలాగే మారింది.

పరిస్థితులు చక్కబడ్డాయని అనుకునేలోపే..

ప్రయాణికులపైన ఆధారపడే..... రైల్వే కూలీల జీవనం సాగుతుంది. రైళ్ల సంఖ్య తగ్గడంతో క్రమంగా కూలీలకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. కొందరు నగరం నుంచి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. తొలిదశ కరోనా ఉదృతి క్రమంగా తగ్గుముఖం పట్టి..... రైళ్లు ఒక్కొక్కటిగా పట్టాలెక్కడంతో తిరిగి నగరానికి వచ్చి పనులు సాగించారు. పరిస్థితులు చక్కబడ్డాయని అనుకునేలోపే కొవిడ్‌ రెండో దశ ప్రారంభమైంది. ఫలితంగా కూలీలు మరోసారి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రైల్వేశాఖ ఆదుకోవాలని విజ్ఞప్తి..

కొవిడ్‌ కారణంగా ప్రయాణికులంతా ఎవరి సామాన్లను వారే మోసుకుంటూ వెళ్లడంతో... పని కరవైపోయిందని కూలీలు వాపోతున్నారు. రైల్వేశాఖ తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


ఇవీ చూడండి:జిల్లాల్లోనూ బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స: డీఎంఈ రమేశ్​రెడ్డి

Last Updated : May 26, 2021, 5:46 AM IST

ABOUT THE AUTHOR

...view details