ఉసేన్ బోల్ట్..! ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని వారుండరేమో! మెరుపు వేగానికి మారుపేరు. 2009లో 100 మీటర్ల రేసును 9.58 సెకన్లలో పూర్తిచేసి, ప్రపంచరికార్డు సృష్టించాడు. ఆ రికార్డు వాయువేగంతో బద్దలు కొట్టాడు కర్ణాటక కంబళ వీరుడు శ్రీనివాస గౌడ. గతేడాది పోటీల్లో 100 మీటర్ల కంబళ రేసును.. ఉసేన్ బోల్ట్ కంటే 3మిల్లీ సెకన్ల తక్కువ వ్యవధిలో పూర్తి చేసి, ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఈ ఏడాది తన రికార్డును తనే తిరగరాసి మరోసారి వార్తల్లో నిలిచాడీ యువతేజం.
మిజార్ అశ్వత్‌పుర శ్రీనివాస గౌడ... దక్షిణ కన్నడ జిల్లాలోని మూడబిద్రిలో గౌడ సామాజిక వర్గంలో పుట్టిపెరిగాడు. కర్ణాటకలో వ్యవసాయం చేసే ఈ వర్గానికి చెందిన రైతులు... ఏటా నిర్వహించే కంబళ పోటీల్లో పాల్గొంటారు. చిన్నప్పటినుంచీ ఆ పోటీలు దగ్గరుండి చూస్తూ పెరిగిన శ్రీనివాస గౌడ...చిన్న వయసులోనే కంబళ క్షేత్రంలోకి దిగాడు.
"నేను బడిలో చదువుకునే సమయంలో శని, ఆదివారాల్లో కంబళ పోటీలు చూసేందుకు వెళ్లేవాణ్ని. అప్పట్లో దున్నలన్నా, కంబళ అన్నా నాకు విపరీతమైన ఆసక్తి ఉండేది. దాశరబెట్టు అనే పోటీదారుడి దున్నను ఆడించేందుకు ఎవరూ లేకపోయేవారు. ఆ సమయంలో పోటీలు జరిగేటప్పుడు బకెట్లలో నీళ్లు తీసుకెళ్లి, రన్నర్లకు సాయం చేసేవాణ్ని. తర్వాత ఆయన ఏడాది పాటు కంబళకు దూరమయ్యారు. అప్పుడు వేరే జట్టుతో కలిసి కంబళకు వెళ్లేవాణ్ని."- శ్రీనివాస గౌడ, కంబళ రన్నర్.
అప్పటినుంచీ కంబళ పోటీల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పాల్గొంటూ వస్తున్న శ్రీనివాస గౌడ పేరు.. గతేడాది మంగళూరులో పోటీలు ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా మార్మోగి పోయింది. నాగలి సీనియర్ విభాగంలో 142.5 మీటర్ల కంబళ రేసును పదమూడున్నర సెకన్లలో పూర్తి చేసి, కర్ణాటకలోనే కాదు... ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు. అంటే 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలోనే దున్నేశాడు. అప్పటివరకూ దేశంలో అంత వేగంగా దూసుకెళ్లిన పరుగు వీరులెవరూ లేరు.
"మేం అకాడమీలో శిక్షణకు వెళ్లకపోతే కంబళలో పాల్గొనే అవకాశం దొరికేది కాదు. పోటీల్లో పాల్గొనే వారందరికీ దున్నలను ఇచ్చి ప్రోత్సహించారు. ప్రాయోగిక పేరుతో జరిగిన కంబళ పోటీల్లో నాకు కేటాయించిన దున్న మొదటి బహుమతి గెలుచుకుంది. ఆ విజయం ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది. కంబళలో బహుమతి రావడం అదే మొదటిసారి. గతేడాది హైకళాభవ కంబళ జరిగింది. దాంట్లో పోటీ విపరీతంగా ఉండింది. దున్నతో సమానంగా, అంతే వేగంగా పరిగెత్తగలిగితేనే పోటీదారుడికి కూడా ప్రాముఖ్యత పెరుగుతుంది. నేను పరిగెత్తించిన దున్న నాకు, మా ఊరికి మంచి పేరు సంపాదించి పెట్టింది."- శ్రీనివాస గౌడ, కంబళ రన్నర్.