వినాయక నిమజ్జనం(GANESH IMMERSION) ఆంక్షలు, నియంత్రణలపై నేడు హైకోర్టు ఉత్తర్వులను వెల్లడించనుంది. హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనం చేయవద్దంటూ న్యాయవాది వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల వాదనలు జరిగాయి. కొవిడ్ నేపథ్యంతో పాటు.. హుస్సేన్ సాగర్ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని గణేశ్ నిమజ్జనం నియంత్రణలపై సూచనలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
జీహెచ్ఎంసీలో(GHMC) హుస్సేన్‌సాగర్‌తో పాటు 48 చెరువులు, కొలనుల్లోనూ వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నామని.. మట్టి గణపతులను(CLAY GANESH IDOLS) పూజించాలని సూచించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. అయితే సూచనలు అవసరం లేదని.. స్పష్టమైన మార్గదర్శకాలు, చర్యలు ఉండాలని హైకోర్టు తెలిపింది. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే.. ప్రస్తుత పరిస్థితులు కూడా పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది.
అలా చేస్తే ప్రజాధనం వృథా
కొవిడ్ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. నగరవ్యాప్తంగా ఎక్కడికక్కడ స్థానికంగా నిమజ్జనం చేయాలని ధర్మాసనం అభిప్రాయపడింది. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఏడాది పొడవునా.. వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నారని.. నిమజ్జనం సమయంలో వాటన్నింటినీ తొలగిస్తున్నారని.. దానివల్ల ప్రజాధనం వృథా అవుతోదందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అందరి సూచనలను తమ ముందుంచితే.. వాటన్నింటినీ పరిశీలించి ఈ నెల6న తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది.