అనారోగ్యంతో తల్లి కన్నుమూశాక.. అమ్మమ్మ, తాతయ్య సంరక్షణలో ఉంటున్న పదినెలల చిన్నారిని తండ్రికి అప్పగించడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిరాకరించింది. అమ్మమ్మ, తాతయ్య వద్ద ఆ చిన్నారి అక్రమ నిర్బంధంలో ఉందని పాప తండ్రి రుజువు చేయడంలో విఫలమయ్యారని పేర్కొంది. పాప పుట్టుక నుంచి ఆలనాపాలనా తాతయ్య, అమ్మమ్మ చూసుకున్నారని, దురదృష్టవశాత్తు అనారోగ్యంతో తల్లి మరణించిందని గుర్తు చేసింది. సహజసిద్ధమైన సంరక్షకుల హక్కులను నిర్ణయించే ముందు.. చిన్నారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం న్యాయస్థానాలపై ఉందని తెలిపింది.
పాపను తనకు అప్పగించాలని తండ్రి సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. అప్పటివరకూ అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉన్న శిశువును చూసుకునేందుకు ప్రతి ఆదివారం తండ్రి వెళ్లవచ్చని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యూ. దుర్గాప్రసాదరావు, జస్టిస్ బీవీఎల్ఎల్ చక్రవర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అత్తమామల అక్రమ నిర్బంధంలో ఉన్న 10 నెలల కుమార్తెను తనకు అప్పగించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ.. ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన గోపి అనే వ్యక్తి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. వ్యాజ్యాన్ని కొట్టేసింది.