తెలంగాణకు రెండోదశ కరోనా ముప్పు పొంచి ఉంది:హైకోర్టు - హైకోర్టులో కరోనా కేసుల విచారణ
13:56 November 19
రాష్ట్రంలో రెండో దశ కరోనా ముప్పు పొంచి ఉంది:హైకోర్టు
రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరీక్షలపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయస్థానంలో కేసు విచారణకొచ్చే సమయంలో పరీక్షల సంఖ్య పెంచి.. తర్వాత తగ్గిస్తున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.
రాష్ట్రంలో రోజుకు 50వేల కరోనా పరీక్షలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క్రమంగా రోజుకు లక్ష వరకు పెంచాలని తెలిపింది. రాష్ట్రంలో రెండో దశ కరోనా ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. భౌతికదూరం, మాస్కుల వంటి కరోనా మార్గదర్శకాలు సరిగా అమలు కావడం లేదని హైకోర్టు వెల్లడించింది. కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అధిక బిల్లులు వసూలు చేసిన ప్రైవేట్ ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జిల్లా ఆస్పత్రుల్లోనూ ఆర్టీపీసీఆర్ కిట్లు అందుబాటులో ఉంచాలని.. ఐసీఎంఆర్ సూచించిన కరోనా పరీక్షలను రాష్ట్రంలో ప్రారంభించాలని ధర్మాసనం ఆదేశించింది. కరోనాపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్రణాళికలు ఎందుకు సమర్పించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణపై ప్రభుత్వానికి అసలు ప్రణాళిక లేదని భావించాలా అని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈనెల 24లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు విచారణ ఈనెల 26కి వాయిదా వేసింది.