Telangana High Court : 'రైతులకు మూడునెలల్లో పరిహారం అందించాలి' - Telangana high court
![Telangana High Court : 'రైతులకు మూడునెలల్లో పరిహారం అందించాలి' The High Court has directed the ts government to pay compensation to farmers who lost their crops last year](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13196826-thumbnail-3x2-kee.jpg)
13:33 September 28
గతేడాది పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశం
గతేడాది వర్షాలతో నష్టపోయిన రైతులకు.. పరిహారమివ్వాలని... హైకోర్టు(Telangana High Court) రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. గతేడాది సెప్టెంబరు, అక్టోబరులో వర్షాలకు నష్టపోయిన పంటను మూడు నెలల్లో అంచనా వేసి.. రైతులకు పరిహారంగా పెట్టుబడి రాయితీ చెల్లించాలని సర్కారుకు స్పష్టం చేసింది. 4 నెలల్లో పంటబీమా సొమ్ము చెల్లించాలని.. ఉన్నత న్యాయస్థానం(Telangana High Court) వెల్లడించింది.
నష్టపోయిన కౌలుదారులకు పరిహారం, బీమా చెల్లించాలని హైకోర్టు(Telangana High Court) పేర్కొంది. పంట దెబ్బతిన్న రైతులను త్వరగా గుర్తించాలని.. సర్కారుకి దిశానిర్దేశం చేసింది. రైతు స్వరాజ్య వేదిక వేసిన.. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై (Telangana High Court) తీర్పు వెలువరించింది.
ఈ పిల్ పై సుమారు ఏడాది పాటు సుదీర్ఘ విచారణ జరిగింది. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పిటిషనర్ తరఫు న్యాయవాది రవికుమార్ కోర్టుకు తెలిపారు. కొందరు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కూడా తీసుకున్నారని వివరించారు. కేంద్రాన్ని 500 కోట్ల రూపాయల సాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరిందని చెప్పారు. అన్ని వాదనలు విన్న ధర్మాసనం.. వర్షాలకు నష్టపోయిన రైతులు, కౌలుదారులకు ఎన్డీఆర్ఎఫ్ లేదా ఎస్డీఆర్ఎఫ్ నిధుల నుంచి పరిహారం, బీమా చెల్లించాలని ఆదేశించింది.
- ఇదీ చదవండి : భవానీపుర్ ఉపఎన్నికలో మార్పు లేదు.. హైకోర్టు స్పష్టం