తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం.. సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలకు సిద్ధం.. - Srirama nagaram

గొప్ప సంకల్పం...! ఇటీవల కాలంలో ఎవరూ నిర్వహించని భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం...! శిల్ప కళా శోభితమైన కళ్లు చెదిరే నిర్మాణాలు...! ఎటు చూసినా మొక్కలతో హాయిగొలిపే పచ్చదనం...! 108 ఆలయాల గోపురాలపై దేవతా మూర్తులతో ఆధ్యాత్మిక సుగంధాల మధ్య 216 అడుగుల భారీ లోహ విగ్రహాం..! ఎటు చూసినా.. ఏం చేసినా... అది తొమ్మిది అనే అంకెతో ముడిపడే నిర్మాణ చాతుర్యం..! ఇంతేనా... సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచి 5వేల మంది రుత్వికులు విచ్చేస్తున్నారు. నిత్యం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షర మంత్రంతో దివ్యక్షేత్రమంతా మార్మోగనుంది. ఇలాంటి ఎన్నో విశేషాల మణిహారం...శ్రీరామ నగరం.

The greatest spiritual center in the world Srirama nagaram is ready to millennium celebrations
The greatest spiritual center in the world Srirama nagaram is ready to millennium celebrations

By

Published : Jan 29, 2022, 5:32 PM IST

ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం.. సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలకు సిద్ధం..

రంగారెడ్డి జిల్లా ముచ్చింతలలోని ఈ దివ్యక్షేత్రంలోకి అడుగుపెట్టగానే అష్టదళ పద్మాకృతిలో ఉండే 45 అడుగుల ఎత్తుతో కూడిన ఫౌంటెయిన్‌ కనిపిస్తుంది. పద్మ పత్రాలు విచ్చుకునేలా దాదాపు 25 కోట్ల రూపాయలతో ఫౌంటెయిన్‌ నిర్మించారు. పద్మపత్రాల మధ్య నుంచి నీళ్లు, రామానుజులను అభిషేకిస్తున్న భావన భక్తులకు కలిగించేలా ఫౌంటెయిన్ ఏర్పాటు చేశారు. అదే సమయంలో రామనుజుల కీర్తనలు శ్రావ్యంగా వినిపించేలా నిర్మాణం చేశారు. సూర్యాస్తమయం తరువాత రామానుజులు ప్రబోధించిన సమానత్వ ఘట్టాలు మ్యూజిక్‌తో త్రీడీ షో ద్వారా ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పూలవనాలతో ముస్తాబైన క్షేత్రం..

ఈ మహోన్నత క్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి సుమారు 1,200 మంది శిల్పులు, ఇతర చేతివృత్తి కళాకారులు నిరంతరం పనిచేస్తున్నారు. ఈ ఆవరణలో రాజస్థాన్‌లో లభించే పింక్‌ గ్రానైట్‌తో తయారు చేసిన పలు ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. రామానుజుల జీవిత విశేషాలు ప్రతిబింబించేలా మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. దివ్యక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు ఆకట్టుకుంటున్నాయి. విభిన్న రంగులతో కూడిన లక్షలాది మొక్కలు ఉద్యానవనాల్లో ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి, ప్రధాని రాక నేపథ్యంలో ముచ్చింతల చుట్టు పక్కల రహదారులను పూల మొక్కలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు.

9 అంకెతో ప్రత్యేక అనుబంధం..

ఈ క్షేత్రంలో... తొమ్మిది అంకెతో చమత్కారం ప్రతి నిర్మాణంలో కన్పిస్తుంది. 9 అంకెను అవికారి అని భావిస్తారు. సమతామూర్తి విగ్రహాన్ని వివిధ కోణాల్లో చూస్తే.. దిగువన భద్రవేదిక 54 అడుగులు, లోటస్ 27 అడుగులు ఉంటుంది. పద్మపీఠం త్రిదళాలు 3వరసల్లో నిర్మాణం చేశారు. ఒక వరసకు 36 చొప్పున మొత్తం 108 ఉంటాయి. చుట్టూ ఏనుగు విగ్రహాలు 9 ఏర్పాటు చేశారు. రామానుజం వారి ఒక కన్ను 4.5 అడుగులు ఉంటుంది. 2 కన్నులు కలిపి 9 అడుగులు ఉంటాయి. వాటర్ ఫౌంటెన్ 36 అడుగులు, పైకి ఎక్కే మెట్లు తొమ్మిదింటిని ఏర్పాటు చేశారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహం 108 అడుగులు, స్వామి చేతిలోని త్రిదండం 27 అడుగుల ఎత్తు ఉన్నాయి. దివ్య దేశాలుగా భావించే 108 పుణ్య క్షేత్రాలు ఏర్పాటు చేశారు. అన్నీ కలిపితే 9సంఖ్య వస్తుంది. 144 యాగశాలలు అవి కూడా తొమ్మిదే. 1,035 హోమగుండాలు ఏర్పాటు చేశారు. అవి కూడా మొత్తం కలిపితే 9 అవుతుంది.

120 కిలోల బంగారు విగ్రహంగా..

ప్రపంచవ్యాప్తంగా కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత ఎత్తయిన విగ్రహాల్లో ఈ సమతా మూర్తి విగ్రహం రెండోది కావడం విశేషం. సమతామూర్తి విగ్రహంలో పద్మపీఠంపై పంచలోహాలతో తయారు చేసిన 36 శంఖు, చక్రాలతో పాటు ఏనుగు ఆకృతులు అమర్చారు. గర్భగుడిలో స్తంభాల పై చెక్కిన ఆకృతులు అలరిస్తున్నాయి. మహా విగ్రహం కింద విశాలంగా ఉన్న గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహ రూపంలో రామానుజులు నిత్యపూజామూర్తిగా కనిపిస్తారు. ఈ విగ్రహం చుట్టూ సప్తవర్ణ కాంతులు ప్రసరించే విధంగా ఏర్పాట్లు చేశారు.

నిత్యం కోటిసార్లు అష్టాక్షరీ మంత్రం..

శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచి 5వేల మంది రుత్వికులు రాబోతున్నారు. 12 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 144 యాగశాలల్లో విశ్వశాంతి కోసం సహస్ర కుండాత్మక మహావిష్ణు యాగం చేస్తున్నారు. నాలుగు దిక్కులలో 36 చొప్పున యాగశాలల సమూహం ఉంటుంది. మొత్తం యాగశాలల్లో 114 చోట్ల యాగాలు జరుగుతాయి. మిగిలినవి సంకల్ప మండపం, అంకురార్పణ మండపం, నిత్యపారాయణ మండపాలు, రెండు ఇష్టిశాలలు. వీటన్నింటిలో 1,035 హోమకుండాలు నిర్మిస్తున్నారు. ఉత్సవాలు జరిగే రోజులలో నిత్యం కోటిసార్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం జపించనున్నారు.

సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

హోమంలో 2లక్షల కిలోల ఆవు నెయ్యిని ఉపయోగించనున్నారు. రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోని దేశీయ ఆవుల నుంచి సేకరించిన స్వచ్ఛమైన నెయ్యిని ఇందుకు వినియోగిస్తారు. రుత్వికులు హోమాల్లో పారాయణాల్లో పాల్గొంటారు. ఆవు పేడతో తయారు చేసిన కట్టెలు, శ్రేష్ఠమైన రావి,జువ్వీ, మేడి, మామిడి వాటితో వచ్చే కట్టెలతో సహస్ర కుండాత్మక యాగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వీటి నుంచి వచ్చే పొగ బ్యాక్టీరియాలు, వైరస్‌లను నిర్మూలిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి హోమకుండం వద్ద ముగ్గురు రుత్వికులు లేదా పండితులు కూర్చుని యాగం చేస్తారు. ఒక్కో యాగశాలకు పర్యవేక్షకుడిగా ఉపద్రష్ట వ్యవహరిస్తారు. మధ్యలో ఉన్న వేదిక వద్ద వేద, ప్రబంధ, ఇతిహాస తదితర పారాయణలు జరుగుతాయి. హోమశాల బయట సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. యాగం చేసే వారిని మినహా మిగిలిన వారిని యాగశాల లోపలికి అనుమతించరు. ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా యాగాలు కొనసాగుతాయి.

ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా..

చరిత్రలో నిలిచిపోయే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో... రామానుజాచార్యుల బోధనలు మరో వెయ్యేళ్లు వర్ధిల్లుతాయని చిన్నజీయర్‌ స్వామి అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సమాజంలో ఉన్న అసమానతలు తొలగిపోవాలంటే ఆ ఆలోచనలు ఎంతో అనుసరణీయం అన్నారు. రానున్న రోజుల్లో సమతామూర్తి కేంద్రం ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details