ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం.. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేసింది. ఈ మేరకుగెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కొత్త రాష్ట్రమైన తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి కేటాయింపులు చేయకుండా బోర్డుల పరిధి ఖరారు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం మొదట్నుంచీ చెబుతోంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఖరారు చేయాలని కోరింది. తాజాగా బోర్డుల పరిధి ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. మంత్రులు కూడా ఎవరు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటువంటి అభిప్రాయాన్ని చెప్పలేదని సమాచారం.
ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదు..
సాగునీటి విషయంలో రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదన్న సీఎం... సందర్భం వచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉభయసభల్లో పోరాడాలని వారికి సూచించారు. గెజిట్ నోటిఫికేషన్ పై విస్తృతంగా, లోతుగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ దిశగా ఇప్పటికే అధికారులు, ఇంజినీర్లు, న్యాయనిపుణులతో సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. గెజిట్లో ఉన్న అంశాలు, విభజన చట్టం, అంతర్ రాష్ట్ర నదీ జలాల చట్టాలు, ఒప్పందాలను అధ్యయనం చేస్తున్నారు. చట్టపరమైన అంశాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలతో పాటు భవిష్యతులో వచ్చే సమస్యలు-వాటి పరిష్కారం, తదితర అంశాలు ఇమిడి ఉన్న నేపథ్యంలో అన్ని అంశాలను అన్ని కోణాల్లో పరిశీలించాలన్న ఆలోచనలో సీఎం ఉన్నట్లు సమాచారం.