కరోనాతో కోల్పోయిన ఆదాయాన్ని సమీకరించుకునేందుకు నిరుపయోగంగా ఉన్న భూముల విక్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 2021-22 వార్షిక బడ్జెట్లో భూముల అమ్మకం ద్వారా రూ.16 వేల కోట్ల నిధులు సమీకరించుకోవాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకొంది. కొవిడ్ రెండో అల ప్రభావంతో ఆ ప్రణాళికలను వెంటనే అమలు చేయలేకపోయింది. వైరస్ ఉధృతి తగ్గి సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన తరుణంలో భూముల అమ్మకాన్ని ప్రారంభించింది. ఆయా కార్పొరేషన్లకు సంబంధించిన భూముల అమ్మకాన్ని చేపట్టింది.
రూ.2,700కోట్లకు పైగా ఆదాయం..
నిరుపయోగంగా ఉన్న, విక్రయించేందుకు అనువుగా ఉన్న భూములను ఇప్పటికే అధికారులు గుర్తించారు. దశల వారీగా భూముల అమ్మకాన్ని చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... ఇటీవలే మొదటి విడత భూముల విక్రయాన్ని పూర్తి చేసింది. తొలి విడతలో భాగంగా 65 ఎకరాల భూములను విక్రయించింది. కోకాపేట భూములు సగటున రూ.40 కోట్లు, ఖానామెట్ భూములు సగటున రూ.48 కోట్లకు పైగా ధర పలికాయి. రికార్డు స్థాయిలో ఎకరా ఏకంగా రూ.60 కోట్ల మార్కును దాటింది. మొత్తంగా 65 ఎకరాల భూముల అమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,700కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
త్వరలోనే మరో దఫా..
మొదటి దశ భూముల అమ్మకానికి మంచి స్పందన వచ్చిందని... డిమాండ్ బాగా ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. తొలివిడత స్పందనతో త్వరలోనే మరో దఫా భూముల అమ్మకాన్ని చేపట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే భూములను గుర్తించినందున అందులో కొన్నింటిని వీలైనంత త్వరగా విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం.