NIMS New Director: నిమ్స్ ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ మనోహర్ అనారోగ్యంతో చికిత్స పొందుతుండడం, పదవీ కాలం ముగియడంతో కొత్త సంచాలకుడిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంచాలకులు రెండేళ్లకోసారి మారడం ఆనవాయితీ. డా.మనోహర్ పదవీ కాలం ముగిసినా పొడిగిస్తూ వచ్చారు. కొత్త డైరెక్టర్‌ను నియమించేందుకు ఒకట్రెండు రోజుల్లో సెర్చ్ కమిటీ ఏర్పాటయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ముగ్గురు సీనియర్ వైద్యులను ఎంపిక చేసి వారిలో ఒకర్ని డైరెక్టర్‌గా నియమిస్తారు. వైద్యుల బదులు ఐఏఎస్ అధికారిని నియమించాలనే చర్చ నడుస్తోంది.
అయిదుగురు ఐఏఎస్‌లు..నిమ్స్ తొలి డైరెక్టర్‌గా ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ కాకర్ల సుబ్బారావు బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత పలువురు సీనియర్ వైద్యులను సంచాలకులుగా కొనసాగించారు. అనంతరం వివిధ కారణాలతో ఐదుగురు ఐఏఎస్ అధికారులు తాత్కాలిక సంచాలకులుగా నియమించారు.
కీలకం కానున్న డైరెక్టర్ పదవి..నిమ్స్ అంతర్గత కుమ్ములాటలకు కేంద్రంగా మారిందనే విమర్శలున్నాయి. ఆ ప్రభావం వైద్య సేవలపై పడుతోంది. సరిగాలేని పాలనా వ్యవస్థ, సిబ్బంది నిర్లక్ష్యం, మౌలిక వసతుల లేమి సమస్యలున్నాయి. కొందరు సీనియర్ వైద్యులు నిమ్స్‌ను వీడుతున్నారు. నోటిఫికేషన్లు లేకుండానే ఇష్టానుసారం నియమిస్తున్నారన్న విమర్శలున్నాయి. సిబ్బంది వసూళ్లు పెరిగాయి. వైద్య పరీక్షల నుంచి చికిత్సల వరకు తీవ్ర జాప్యమవుతోంది. కొన్నిసార్లు అంబులెన్సులోనే రోగులు మరణిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమన్న ఆరోపణలున్నాయి.
డైరెక్టర్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరడంపై దుమారం.. తాజాగా డైరెక్టర్ డాక్టర్ మనోహర్ అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరడం దుమారం రేపింది. ఇలాగైతే రోగులకు భరోసా ఎవరిస్తారని ప్రశ్నిస్తున్నారు. సమర్థుడికి అప్పగిస్తేనే నిమ్స్ గాడిన పడే అవకాశం ఉంటుందంటున్నారు.
ఇవీ చదవండి: