తెలంగాణ

telangana

ETV Bharat / city

లోతట్టు ప్రాంతాల్లో తగ్గని నీరు.. బురద నీటిలోనే కాలనీలు - హైదరాబాద్​ తాజా పరిస్థితి

హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాల వాసుల వరద కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారం రోజులుగా పలు కాలనీలు ఇంకా నీళ్లలోనే ఉండగా... మోకాళ్ల లోతు నీళ్లలో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాస్త తెరిపిన పడుతున్న సమయంలో మళ్లీ వర్షాలు కురవడంతో ఆవేదన చెందుతున్నారు.

లోతట్టు ప్రాంతాల్లో తగ్గని నీరు.. బురద నీటిలోనే కాలనీలు
లోతట్టు ప్రాంతాల్లో తగ్గని నీరు.. బురద నీటిలోనే కాలనీలు

By

Published : Oct 20, 2020, 9:47 PM IST

లోతట్టు ప్రాంతాల్లో తగ్గని నీరు.. బురద నీటిలోనే కాలనీలు

భారీ వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో కాలనీల్లో వరద తగ్గడం లేదు. గత మంగళవారం కుండపోతకు తోడు.. శనివారం మరోసారి కురిసిన భారీ వర్షం.. నగరవాసులను కోలుకోకుండా చేసింది. కాస్త తెరిపిన పడుతున్న సమయంలో మళ్లీ కురుస్తున్న వర్షాలు కోలుకోలేకుండా చేస్తున్నాయి. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని రామంతాపూర్‌లోని పలు కాలనీల్లో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

మోకాళ్ల లోతు నీళ్లలో..

భారీ వరదపోటుకు చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని కాలనీలన్నీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మోకాళ్ల లోతు నీళ్లలో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇళ్లలో భారీగా బురద పేరుకుపోయింది. ఈ ప్రాంతంలోకి 3 మృతదేహాలు కొట్టుకొచ్చాయి.

పేరుకుపోయిన బురద..

వరద ముంపుతో పాతబస్తీ అల్​జుబైల్ కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇంటి సామగ్రి నీటిలో కొట్టుకెళ్లాయి. ఇళ్లలో బురద పేరుకుపోయి కాలనీల చుట్టూ భారీగా చెత్త పోగైంది. విద్యుత్ సరఫరా నిలిచి కాలనీలవాసులు అంధకారంలోనే మగ్గుతున్నారు. పాతబస్తీ చార్మినార్ సమీపంలో పురాతన గోడ కూలి భారీ ప్రమాదం తప్పింది. పురాతన ఇంటి కింద ఉన్న దుకాణం, ఓ కారు ధ్వంసమయ్యాయి.

ఓవర్ బ్రిడ్జ్​కి గుంత..

ఫలక్‌నుమ ఓవర్ బ్రిడ్జ్‌కి సైతం 6 అడుగుల భారీ గుంత పడడంతో ఆప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. నగర శివారు బాలాపూర్ గుర్రం చెరువు కట్ట తెగడంతో బాబానగర్ ప్రాంతం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీగా వాహనాలు కొట్టుకుపోయాయి. కట్ట తెగిన గుర్రం చెరువు, పల్లె చెరువు మరమ్మతులు పూర్తయ్యాయి. వర్షం వచ్చినా చెరువుల నుంచి నీరు బయటకు రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. టోలిచౌకీలోని నదీమ్‌కాలనీలో 8వ రోజూ వరద కొనసాగుతూనే ఉంది

తప్పని ట్రాఫిక్​ తిప్పలు..

హైదరాబాద్ నాగార్జున సర్కిల్ మీదుగా మాసబ్​ట్యాంక్ వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్​ స్తంభించిపోతోంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ ఒకటిలో మురుగు పైపులైన్ లీకేజీ కావడంతో... రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మాసబ్​ట్యాంక్ వైపునకు మళ్లిస్తున్నారు.

జేసీబీతో కూల్చివేత..

బషీర్‌బాగ్‌లోని పాతకమేల బస్తీలో రెండు ఇళ్లు కూలిపోయాయి. అదే వీధిలో శిథిలావస్థకు చేరిన పలు ఇళ్లను జీహెచ్​ఎంసీ అధికారులు జేసీబీతో కూల్చివేశారు. నిరాశ్రయులుగా మారిన తమను అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ఇవీ చూడండి:ఏ క్షణంలోనైనా రంగంలోకి దిగేందుకు ఆర్మీ బలగాలు సిద్ధం

ABOUT THE AUTHOR

...view details