దేశంలో టీకా పంపిణీ వేగవంతం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్న వేళ.. రష్యా అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వి అందుబాటులోకి వచ్చింది. మాస్కో నుంచి ఈనెల 1నే స్పుత్నిక్-వి టీకా డోసులు హైదరాబాద్ చేరుకోగా...కౌసౌలీలోని సెంట్రల్ డ్రగ్స్ లేబొరేటరీ అనుమతితో ఇవాళ మొదటి డోసు ఇచ్చినట్టు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది.
రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకాను భారత్‌లో డాక్టర్ రెడ్డీస్ సహా మరో నాలుగు సంస్థలు ఉత్పత్తి చేయనున్నాయి. స్పుత్నిక్-వి ఒక్కో డోసు ధర 948 రూపాయలుగా నిర్ణయించినట్టు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. ఈ ధరకు 5శాతం జీఎస్టీ అదనమని వెల్లడించింది. ఒక్కో డోసుకు 996 రూపాయల వరకు ఖర్చవుతుందని వివరించింది. స్థానికంగా ఉత్పత్తి ప్రారంభిస్తే వీటి ధర మరింత తగ్గుతుందని పేర్కొంది. దేశంలో.. కొవిషీల్డ్, కొవాగ్జిన్ ఇప్పటికే అందుబాటులో ఉండగా ఇప్పుడు స్పుత్నిక్-వి అందుబాటులోకి వచ్చింది.