Fitness Test Fees for Commercial Vehicles: వాణిజ్య వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలకు సంబంధించిన అపరాధ రుసుం వసూళ్ల విషయమై రవాణా శాఖ తర్జనభర్జన పడుతోంది. నిర్ణీత గడువులోగా వాహన ఫిట్‌నెస్ పరీక్ష చేయించని వారి నుంచి వసూలు చేయాల్సిన అపరాధ రుసుంను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఏప్రిల్‌లో సవరించింది. పరీక్ష చేయించడానికి విధించిన గడువు ముగిసినప్పటి నుంచి రోజుకు రూ.50 చొప్పున అపరాధ రుసుంను వసూలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. గతంలో ఇది రూ.10గా ఉండేది. ఫిట్నెస్ పరీక్ష ఛార్జీలనూ భారీగా పెంచింది. పెరిగిన ఛార్జీలను ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అపరాధ రుసుంను మాత్రం గడువు తీరిన నాటి నుంచి వాహనదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది వాహనదారులకు పెనుభారంగా మారుతోంది. అయితే, ఈ రుసుంను తగ్గించాలా? రద్దు చేయాలా? వసూలు చేయాలనుకుంటే ఎప్పటి నుంచి వసూలు చేయాలి? అన్న అంశాలను రవాణా శాఖ ఎటూ తేల్చుకోలేకపోతోంది.
వాణిజ్య వాహనాలకు పెరిగిన అపరాధ రుసుం.. యజమానులకు భారం.. - కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ
Fitness Test Fees for Commercial Vehicles: వాణిజ్య వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలకు సంబంధించిన అపరాధ రుసుం వసూళ్ల విషయమై రవాణా శాఖ తర్జనభర్జన పడుతోంది. గడువులోపు ‘ఫిట్‌నెస్’ పరీక్ష చేయించని వారి నుంచి వసూలు చేయాల్సిన అపరాధ రుసుంను కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో సవరించింది. గడువు ముగిసినప్పటి నుంచి రోజుకు రూ.50 చొప్పున అపరాధ రుసుంను వసూలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఫిట్‌నెస్ పరీక్ష ఛార్జీలనూ భారీగా పెంచింది. చెల్లింపునకు యజమానులు నానా తంటాలు పడుతున్నారు.
రాష్ట్రంలో 15 లక్షల వరకు వాణిజ్య వాహనాలు ఉంటాయని అంచనా. వాటిలో 15 సంవత్సరాలు దాటినవి లక్షల్లో ఉంటాయి. వాణిజ్య వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న మొదటి 8 సంవత్సరాల వరకు ప్రతి రెండేళ్లకోసారి ఫిట్‌నెస్ పరీక్ష చేయించాలి. ఎనిమిదేళ్లు దాటిన తరవాతి నుంచి ప్రతి ఏటా చేయించుకోవాల్సి ఉంటుంది. కాలంచెల్లిన వాహనాలకూ ఏటా నిర్వహించాల్సిందే. కరోనా కారణంగా గడిచిన మూడేళ్లలో అధిక శాతం వాణిజ్య వాహనదారులు ‘ఫిట్‌నెస్’ చేయించలేదు. ప్రస్తుతం పరీక్షలు చేయించేందుకు సిద్ధమవుతున్న వాహన యజమానులకు ఈ అపరాధ రుసుం భారంగా మారుతోంది. మూడేళ్లుగా భారీగా పేరుకుపోయిన మొత్తాన్ని చూసి అవాక్కవుతున్నారు. వీటిని చెల్లించే విషయమై వాహనదారుల నుంచి వ్యతిరేకత రావడంతో రవాణా శాఖ అధికారులు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఉన్న అపరాధ రుసుం మొత్తాన్ని రద్దు చేయాలా? ప్రస్తుతం ఉన్న దాన్ని తగ్గించాలా? అన్న విషయాన్ని నిర్ణయించాలని ప్రభుత్వానికి దస్త్రం పంపారు.
విక్రయించినా.. చెల్లించలేం!..కరోనా కాలంలో వ్యాపారం మందగించడానికితోడు పెరిగిన డీజిల్ ధరలు ఇబ్బందికరంగా మారాయని వాణిజ్య వాహనదారులు వాపోతున్నారు. వాహనాలను తుక్కు(స్క్రాప్) కింద విక్రయించినా.. చెల్లించాల్సిన అపరాధ రుసుం అంత మొత్తం రాదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారీగా పెరిగిన రుసుంను ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. పన్నులను కేంద్రం పెంచినా.. అమలులో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. 2012లో కేంద్రం అపరాధ రుసుంను తొలిసారిగా అమలులోకి తీసుకువచ్చింది. ఆ మొత్తాలను అమలు చేయొద్దని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. అధికారులు పంపిన దస్త్రంపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చర్చనీయాంశమైంది.