తెలంగాణ

telangana

ETV Bharat / city

Gold in Ap: అనంతపురం జిల్లాలో పది చోట్ల బంగారు నిక్షేపాలు - అనంతపురం జిల్లా

ఏపీలో పది చోట్ల బంగారు నిక్షేపాలను గనులశాఖ గుర్తించింది. బంగారం ధర అనుకూలంగా ఉన్నందున వీటిని వెలికి తీస్తే లాభదాయకమేనని గనులశాఖ భావిస్తోంది. దీనికి అవసరమైన కాంపోజిట్‌ లైసెన్సు జారీకి త్వరలో ఈ-వేలం నిర్వహిస్తామని గనులశాఖ అధికారులు చెబుతున్నారు.

Gold in Ap: అనంతపురం జిల్లాలో పది చోట్ల బంగారు నిక్షేపాలు
Gold in Ap: అనంతపురం జిల్లాలో పది చోట్ల బంగారు నిక్షేపాలు

By

Published : Sep 27, 2021, 11:16 PM IST

ఏపీలో పది చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గనులశాఖ(The Department of Mines has identified gold deposits at ten places in the state) గుర్తించింది. ఇవన్నీ అనంతపురం జిల్లా పరిధి లోనివే ! రాష్ట్ర గనులశాఖ పరిధిలో ఉండే ఖనిజాన్వేషణ విభాగం ఈ నిక్షేపాలపై అధ్యయనం చేసి గుర్తించింది. మండల కేంద్రం రామగిరిలో గతంలో భారత్‌ గోల్డ్‌మైన్స్‌ లిమిటెడ్‌ (బీజీఎంఎల్‌) గనులు ఉండేవి. వీటిలో 2001 నుంచి తవ్వకాలు నిలిపేశారు. ఇప్పుడు దీనికి సమీపంలో 2 ప్రాంతాల్లో, రొద్దం మండలం బొక్సంపల్లిలో రెండుచోట్ల, కదిరి మండలం జౌకుల పరిధిలో ఆరుచోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ పది ప్రాంతాల్లోని 97.4 చదరపు కి.మీ. పరిధిలో నిక్షేపాలు ఉన్నాయి.

టన్ను మట్టిలో 4 గ్రాములు..

ఆయా ప్రాంతాల్లో భూమి లోపలికి 50 మీటర్ల నుంచి మరింత దిగువకు వెళ్లే కొద్దీ బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. టన్ను మట్టి తవ్వితీస్తే 4 గ్రాముల బంగారం ఉంటుంది. అత్యధికంగా జౌకులలోని ఆరు ప్రాంతాల్లో కలిపి 10 టన్నులు, రామగిరిలో నాలుగు టన్నులు, బొక్సంపల్లిలోని రెండు టన్నులు కలిపి మొత్తంగా 16 టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. భూగర్భ గనులుగా ఇక్కడ తవ్వకాలు చేపట్టేందుకు వీలుంటుందని చెబుతున్నారు. మార్కెట్‌లో ప్రస్తుతమున్న బంగారం ధరలను బట్టి ఈ ప్రాంతాల్లో గిట్టుబాటు అవుతుందని అంటున్నారు.

మరింత అన్వేషణకు లైసెన్సులు..

రాష్ట్రంలో తొమ్మిది చోట్ల బేస్‌ మెటల్‌, కాపర్‌, గోల్డ్‌, మాంగనీస్‌, వజ్రాలు, ఇనుప ఖనిజ బ్లాక్‌లను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) గుర్తించగా.. ఇటీవల వీటిని రాష్ట్రానికి కేంద్రం అప్పగించింది. ఈ ప్రాంతాల్లో మరింత ఖనిజాన్వేషణకు కాంపోజిట్‌ లైసెన్సు ఇవ్వనున్నారు. వీటితోపాటు రాష్ట్ర గనులశాఖ గుర్తించిన పది బంగారు నిక్షేపాల ప్రాంతాలకు కూడా కాంపోజిట్‌ లైసెన్సు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక్కో వ్యక్తి లేక సంస్థకు వెయ్యి హెక్టార్ల వరకు ఈ లైసెన్సు ఇస్తారు. ఆ ప్రాంతంలో ఖనిజ నిల్వలపై మరింత అన్వేషణ చేసుకోవాలి. పూర్తిస్థాయిలో ఖనిజ నిక్షేపాలు గుర్తించిన చోట మైనింగ్‌ లీజు కేటాయిస్తారు. కాంపోజిట్‌ లైసెన్సు జారీకి త్వరలో ఈ-వేలం నిర్వహిస్తామని గనులశాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:Gulab Cyclone effects on Hyderabad : రెండు గంటల వర్షం... నీట మునిగిన భాగ్యనగరం

ABOUT THE AUTHOR

...view details