Group-1 Applications: రాష్ట్రం ఏర్పడ్డాక వచ్చిన తొలి గ్రూప్-1కు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 31తో ముగియనుంది. మొత్తం 503 పోస్టులకు ఇప్పటివరకు 2.62 లక్షల మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. గడువు ముగిసేసరికి వీటి సంఖ్య 3 లక్షల వరకు చేరుకునే అవకాశాలున్నాయని టీఎస్‌పీఎస్సీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 2 నుంచి గ్రూప్-1 కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. రోజుకు సగటున 10 వేల చొప్పున దరఖాస్తులు వచ్చాయి. గడువు సమీపిస్తుండటంతో రోజువారీ దరఖాస్తుల సంఖ్య 15 వేలకు పైగా ఉంటోంది. గ్రూప్-1 యూనిఫాం పోస్టులైన డీఎస్పీ, డీఎస్‌జే, ఏఈఎస్ పోస్టుల గరిష్ఠ వయోపరిమితి, శారీరక దారుఢ్య పరీక్షల అర్హతల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. యూపీఎస్సీ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని, అభ్యర్థుల డిమాండ్ మేరకు అర్హతలను ఖరారు చేసింది. గ్రూప్-1 దరఖాస్తును సులువుగా నింపేలా రూపొందించింది. ఓటీఆర్‌తో లాగిన్ అయితే టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన ఎన్ని నోటిఫికేషన్లకు దరఖాస్తు చేశాం? రిఫరెన్సు నంబర్లు తదితర విషయాలు తెలుసుకునేలా వెసులుబాటు కల్పించింది.
ఓటీఆర్‌లో సవరణలు ఎక్కువ.. దరఖాస్తులు తక్కువ...
రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల సంఖ్య పెరిగింది. స్థానికత నిర్వచనం, స్థానిక కోటాలో మార్పులొచ్చాయి. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ వద్ద వన్ టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్)లో నమోదైన ఉద్యోగార్థులు నూతన ఉత్తర్వుల ప్రకారం సవరణ చేసుకోవాలని కమిషన్ సూచించింది. రెండు నెలల క్రితం ఈ మేరకు ఆప్షన్ ఇచ్చింది. గతంలో ఓటీఆర్‌లు నమోదు చేసుకున్న 25 లక్షల మందిలో 3,27,720 మంది మాత్రమే నూతన ఉత్తర్వుల ప్రకారం వివరాలను సవరించుకున్నారు. మరో 1,59,304 మంది కొత్తగా ఓటీఆర్‌లు నమోదు చేసుకున్నారు. నూతన ఉత్తర్వుల ప్రకారం ఓటీఆర్‌లో వివరాలు సవరించుకున్న, కొత్తగా నమోదు చేసుకున్నవారు మొత్తం 4,87,024 మంది ఉండగా.. వీరిలో 2,62,590 మంది మాత్రమే గ్రూప్-1కు దరఖాస్తు చేశారు. గ్రూప్-4 ప్రకటన వెలువడితే భారీ సంఖ్యలో ఓటీఆర్ సవరణలతో పాటు దరఖాస్తులొచ్చే అవకాశముందని కమిషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్రూప్-4 ఖాళీల భర్తీకి సంబంధిత విభాగాలు రోస్టర్ ప్రకారం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి. ఆదివారం నాటికి కమిషన్‌కు ఈ ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించినప్పటికీ.. ప్రభుత్వం ఇప్పటివరకు పోస్టుల భర్తీకి అనుమతిస్తూ జీవో ఇవ్వలేదు.
ఇవీ చదవండి:డ్రైవర్ పోస్టులకు పట్టభద్రులు... కానిస్టేబుల్ ఉద్యోగానికి పోస్టుగ్రాడ్యుయేట్లు...