Polavaram Project Funds : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు వెచ్చించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా తొలిదశ పేరుతో లెక్కలు కట్టిస్తోంది. తొలిదశలో +41.15 మీటర్ల స్థాయిలో నీళ్లు నిల్వచేసి కుడి, ఎడమ కాలువలకు, ఆయకట్టుకు ఇవ్వాలంటే ఆ స్థాయి నిర్మాణానికి, పునరావాసానికి ఎంత ఖర్చవుతుందని మళ్లీ లెక్కలు అడుగుతోంది. అక్కడివరకు నీళ్లు ఇస్తే ఏ స్థాయి ప్రయోజనాలు కలుగుతాయో అనీ కేంద్ర జలసంఘం గతంలోనే ఒక సమావేశం ఏర్పాటుచేసి వివరాలు కోరింది. కేంద్ర జలసంఘం డైరెక్టర్ ఒకరు ఇదే పనిపై ఉండి పోలవరం అధికారులకు మార్గదర్శనం చేస్తూ లెక్కలు సిద్ధం చేయిస్తున్నారు. ఇందుకోసం పోలవరం ఇంజినీర్లు కొందరు ప్రస్తుతం దిల్లీలో ఉండి ఆ కసరత్తులో భాగస్వాములయ్యారు.
Polavaram Project Funding issue : పోలవరం డ్యాంను +45.72 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు అనుగుణంగా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం లెక్కలు కట్టించాయి. 2011-12 లెక్కల ప్రకారం, 2013-14 లెక్కలు, 2017-18 లెక్కల ఆధారంగా ఎప్పుడో కొలిక్కి తెచ్చారు. 2013-14 లెక్కల్లో కేంద్ర జలసంఘం అంచనాల ప్రకారం ఎంత? రివైజ్డు కాస్ట్ కమిటీ (అంచనాల సవరణ కమిటీ-ఆర్‌సీసీ) ప్రకారం ఎంతో కూడా లెక్క కట్టించారు. 2017-18 ధరల ప్రకారం ఆర్‌సీసీ రూ.47,725.74 కోట్లకు సిఫార్సు చేసింది. ఇది జరిగి రెండేళ్లు దాటింది. ఈ మొత్తానికి కేంద్రం పెట్టుబడి అనుమతి ఇచ్చి పనులను తొలిదశ, రెండో దశగా విడగొట్టి ఆ మేరకు నిధులు విడుదల చేస్తే సరిపోయేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Polavaram Project news : ఇప్పుడు ప్రత్యేకంగా తొలిదశ పేరుతో మళ్లీ లెక్కలు కట్టాలని కోరుతోంది. 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎప్పటికప్పుడు లెక్కలు కడుతున్నారు తప్ప కేంద్రం దీన్ని కొలిక్కి తెచ్చి పెట్టుబడి అనుమతి ఇచ్చేందుకు అడుగు ముందుకు వేయలేదు. ఇప్పటికే ప్రాజెక్టులో అన్ని విభాగాలకు సంబంంధించిన ఖర్చుల లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి. పైగా పునరావాసంలో +41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలిపితే ఎంత? ఆ తర్వాత +45.72 మీటర్ల స్థాయికి నీరు నిలిపితే ఎంత ఖర్చవుతుందో కూడా లెక్కలేశారు. ఆర్‌సీసీ ఆమోదించిన 2017-18 లెక్కల ఖర్చుకు పెట్టుబడి అనుమతి ఇచ్చి, నిధులు విడుదల చేస్తూ తొలిదశ, మలి దశగా విడగొట్టే అవకాశం ఉంది. డిజైన్ల మార్పు వల్ల పెరిగిన అదనపు పనికి అయ్యే వ్యయాన్ని దానికి జతచేస్తే సరిపోతుందనే అభిప్రాయం ఇంజినీర్లలో ఉంది.
+41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టినా ప్రాజెక్టు, కాలువల నిర్మాణపరంగా వ్యత్యాసం ఏమీ ఉండదని, ఆ ఖర్చు యథాతథంగానే ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇప్పుడు మళ్లీ తొలిదశ అంటూ లెక్కలు కట్టించడం చర్చనీయాంశమవుతోంది.