తెలంగాణ

telangana

ETV Bharat / city

Tirupati airport: ప్రైవేటుకు తిరుపతి ఎయిర్‌పోర్టు..తర్వాత అవే..! - telangana news

దేశంలోని తిరుపతితో(Tirupati airport) పాటు మరో 12 విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం సిద్ఘమైంది. ఏడు చిన్న, ఆరు పెద్ద విమానాశ్రయాలను కలిపి ఉమ్మడిగా బిడ్డింగ్‌ నిర్వహించాలని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రతిపాదించింది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు విమానాశ్రయాల అప్పగింత పూర్తయ్యేలా వ్యూహరచన చేస్తోంది.

Tirupati airport, Tirupati airport privatization news
ప్రైవేటుకు తిరుపతి ఎయిర్‌పోర్టు, తిరుపతి ఎయిర్​పోర్టు వార్తలు

By

Published : Oct 27, 2021, 9:20 AM IST

దేశంలోని 13 విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. వీటిలో తిరుపతి(Tirupati airport) కూడా ఉంది. ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపినట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ సంజీవ్‌కుమార్‌ జాతీయ మీడియాకు వెల్లడించారు. ఏడు చిన్న, ఆరు పెద్ద విమానాశ్రయాలను కలిపి ఉమ్మడిగా బిడ్డింగ్‌ నిర్వహించాలని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రతిపాదించింది. ఇందులో భాగంగా వారణాశి-ఖుషీనగర్‌, గయ, అమృత్‌సర్‌-కాంగ్రా, భువనేశ్వర్‌-తిరుపతి, రాయ్‌పుర్‌-ఔరంగాబాద్‌, ఇండోర్‌-జబల్‌పుర్‌, తిరుచ్చి-హుబ్లి విమానాశ్రయాలను ఒక్కో ప్రాజెక్టులా ప్రైవేటుకు అప్పగించనున్నారు. లాభాలు పెద్దగా లేని విమానాశ్రయాలను మంచి లాభాలున్న వాటితో కలిపి బిడ్డింగ్‌కు పెట్టడం వల్ల ప్రైవేటు సంస్థలు స్పందిస్తాయని కేంద్రం భావిస్తోంది.

2022-25 మధ్య దేశంలోని 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించి, రూ.20,782 కోట్లు రాబట్టుకోవాలని నిర్ణయించినట్లు నేషనల్‌ మానిటైజేషన్‌ పాలసీలో కేంద్రం ప్రకటించింది. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చేతిలో 137 విమానాశ్రయాలు ఉన్నాయి. అందులో 24 అంతర్జాతీయ, 10 కస్టమ్స్‌, 103 దేశీయ విమానాశ్రయాలు. 2020-21లో అహ్మదాబాద్‌, లఖ్‌నవూ, మంగళూరు, గువాహటి, జైపుర్‌, తిరువనంతపురం విమానాశ్రయాలను ప్రైవేటుకు అప్పగించేసింది. ఇప్పుడు అమృత్‌సర్‌, వారణాశి, భువనేశ్వర్‌, ఇండోర్‌, రాయ్‌పుర్‌, తిరుచ్చిలతో కలిపి మరో 7 చిన్నవాటిని విక్రయానికి పెట్టడానికి సిద్ధమైంది.

2024లో ఏపీలోని విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను(Tirupati airport) ప్రైవేటీకరించి రూ.860 కోట్లు రాబట్టుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కానీ ఇప్పుడు తిరుపతి విమానాశ్రయాన్ని 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటుకు అప్పగించాలనుకున్న 6 పెద్దవాటితో కలిపి బిడ్డింగ్‌కు ఉంచుతోంది. ఆ తర్వాత బిడ్డింగ్‌లలో విజయవాడ, రాజమహేంద్రవరం విమానాశ్రయాలు ఉండొచ్చు. నేషనల్‌ మానిటైజేషన్‌ పాలసీ ప్రకారం విజయవాడ విమానాశ్రయం ద్వారా రూ.800 కోట్లు, తిరుపతి ద్వారా రూ.260 కోట్లు, రాజమహేంద్రవరం ద్వారా రూ.130 కోట్లు సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొంది.

ఇదీ చూడండి:Anthrax Disease in Sheep: మటన్ కొంటున్నారా.. అయితే జాగ్రత్త!

ABOUT THE AUTHOR

...view details