తెలంగాణ

telangana

ETV Bharat / city

కార్పొరేషన్ల పేరిట రుణ సేకరణపై కేంద్రం నజర్‌ - Center focus on ap debt collection

Central govt focus on AP debts ఏపీలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా దృష్టి సారిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషన్‌కు బ్యాంకులు రుణాలివ్వకుండా కిందటి ఆర్థిక సంవత్సరంలోనే నిలిపేసిన కేంద్రం తాజాగా బెవరేజెస్‌ కార్పొరేషన్‌ అంశంపైనా దృష్టి సారించింది.

Center focus on debt collection
Center focus on debt collection

By

Published : Aug 26, 2022, 2:20 PM IST

Central govt focus on AP debts ఆంధ్రప్రదేశ్​లో జరుగుతున్న ఆర్థిక అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా దృష్టి సారిస్తోంది. ఏపీ అభివృద్ధి కార్పొరేషన్‌కు బ్యాంకులు రుణాలివ్వకుండా కిందటి ఆర్థిక సంవత్సరంలోనే నిలిపేసిన కేంద్రం తాజాగా బెవరేజెస్‌ కార్పొరేషన్‌ అంశంపైనా దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌కు దీనితోపాటు ఇతర అనేక అంశాలపై లేఖ రాయడంతోపాటు చర్చించేందుకు దిల్లీకి పిలిచింది. ప్రభుత్వ ఆదాయాన్ని నిబంధనలకు వ్యతిరేకంగా మళ్లించడం ఒక అంశమైతే, భవిష్యత్తు ఆదాయాలనూ తాకట్టు పెట్టడం మరో కీలకాంశంగా ఉంది. ఏపీ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ను ఆధారంగా చేసుకుని ఆర్బీఐ ద్వారా కేంద్రం రుణాలు ఇప్పిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం తన ఆదాయంలోని కొంత భాగాన్ని కార్పొరేషన్లకు మళ్లిస్తోంది. అంటే అప్పు తీర్చే సామర్థ్యం తగ్గిపోతోంది. పైగా అప్పు తీర్చేందుకు ఏ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ను ఆధారంగా చూపి రుణం తెచ్చారో... అదే ఆదాయాన్ని కార్పొరేషన్‌కు మళ్లించి, దాన్నే తాకట్టుగా పెట్టి, మళ్లీ రూ.వేల కోట్ల అప్పులు తెస్తోంది. ఈ రుణాలు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం పరిధిలోకి రావడం లేదు. వాస్తవ ద్రవ్యలోటూ తెలియడంలేదు. ఫలితంగా అపరిమిత అప్పులతో ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాజ్యాంగ ఉల్లంఘనలూ...భవిష్యత్తు ఆదాయాన్ని కూడా ఇప్పుడే తాకట్టు పెడుతున్న తీరుపై ఏపీ ఆర్థికశాఖలో ముఖ్య కార్యదర్శులుగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా గతంలో పనిచేసిన ఉన్నతాధికారులు సైతం ప్రశ్నించారు. సాధారణంగా బడ్జెట్‌ ఏడాది కాలానికే ఉంటుంది. ఆర్థిక బిల్లు, సప్లిమెంటరీ బడ్జెట్‌ల ఆమోదం కూడా ఆ ఏడాదికే పరిమితమవుతుంది. మార్చి 31 తర్వాత చేసే ప్రతి ఖర్చుకు మళ్లీ చట్టసభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. అలాంటిది ఏపీ అభివృద్ధి కార్పొరేషన్‌ పేరిట అప్పులు తెచ్చేందుకు అదనపు ఎక్సయిజ్‌ సుంకం విధించి, ఆ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్​ ఖజానాకు రప్పించాక ఏపీఎస్‌డీసీ కార్పొరేషన్‌కు మళ్లించేందుకు చట్ట సవరణ చేశారు. ఏపీఎస్‌డీసీ రుణం తీర్చాలంటే 13 ఏళ్లు పడుతుంది. ఈతరహాలోనే బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.8,300 కోట్ల డిబెంచర్లు జారీ చేసి రుణం తీసుకున్నారు. ఏపీ రాబడిగా ఉండే వ్యాట్‌ను తగ్గించి అంతే మొత్తానికి కార్పొరేషన్‌ ద్వారా ప్రత్యేక సుంకం విధించుకోవచ్చని కూడా చట్టం చేశారు. ఆ ఆదాయం పదేళ్లపాటు కార్పొరేషన్‌కు మళ్లిపోతుంది. అంటే ఏపీ ఖజానా రాబడి ఆ మేరకు తగ్గిపోతుంది. ఇవన్నీ ఉల్లంఘనలే అని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.

* పెట్రోలు, డీజిల్‌పై సుంకం విధించి ఆ మొత్తాన్ని ఏపీ రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారు. ఆ ఆదాయాన్ని ఆధారంగా చూపించి రూ.వేల కోట్ల రుణం తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్​లోని ఆర్‌అండ్‌బీ భవనాలను, అతిథి గృహాలను, స్థలాలను కార్పొరేషన్‌కు మళ్లించారు. వాటిని అప్పు తెచ్చుకునేందుకు తనఖా పెట్టారు.

* మార్క్‌ఫెడ్‌కు ఏపీలోని మార్కెట్‌ కమిటీల ఆస్తులు బదలాయించారు. ధాన్యం, రొయ్యలపై అదనంగా మార్కెట్‌ ఫీజు వసూలు చేస్తూ మార్క్‌ఫెడ్‌ నుంచి కూడా రుణాలు తీసుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details