పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల గణనకు సమయం తక్కువ ఉండటంతో సంప్రదాయ పద్ధతిలో లెక్కింపు విధానానికి జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ), వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) స్వస్తి పలికాయి. సాంకేతికత సాయంతో ఆన్‌లైన్‌లో ప్రక్రియను కొనసాగిస్తాయి. దీనికోసం ‘ఎకొలాజికల్ యాప్’ను రూపొందించాయి. దీని వాడకంపై దక్షిణాది రాష్ట్రాల్లో 15 టైగర్ రిజర్వుల అధికారులకు తమిళనాడులోని ముదుమలై టైగర్ రిజర్వులో ఇటీవల నిర్వహించిన 3రోజుల శిక్షణలో రాష్ట్రంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధి అటవీ అధికారులు హాజరయ్యారు. సెప్టెంబరు నుంచి తమ పరిధిలోని అధికారులకు వారు శిక్షణ ఇవ్వనున్నారు.
Wildlife census: యాప్ తోడుగా ముందస్తు లెక్కింపునకు సన్నాహాలు - tigers in Telangana
పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల గణన ఈసారి ముందస్తుగా చేపట్టనున్నారు. ఏడాదిపాటు జరిగే 75వ స్వాతంత్య్ర దిన వేడుకల నేపథ్యంలో ప్రధాని మోదీతో నివేదికను విడుదల చేయించాలని కేంద్ర పర్యావరణశాఖ నిర్ణయించింది.
2006నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పులుల గణన నాలుగేళ్లకోసారి చొప్పున నాలుగుసార్లు నిర్వహించారు. ఐదో గణనను అక్టోబరులో మొదలుపెట్టి నవంబరులో పూర్తి చేయాలని నిర్ణయించారు. ‘అఖిల భారత పులుల అంచనా-2018’ నివేదిక 2019 జులై 29న విడుదలైంది. మళ్లీ 2022లో గణన చేపట్టాలి. ఇది ఫిబ్రవరి నుంచి డిసెంబరు వరకు జరుగుతుంది. క్షేత్రస్థాయి వివరాలు ఎన్టీసీఏకు వెళ్లి, తర్వాత సందేహాల నివృత్తికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది. అంటే 2023 జులైలో వచ్చే ప్రపంచ దినోత్సవంనాటికి కూడా కష్టమే. 2022 ఆగస్టు 15వరకు స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరగనున్నందున వచ్చే ఏడాది జులై 29నే గణన వివరాలను విడుదల చేయించేలా జాతీయ పర్యావరణశాఖ ప్రణాళిక రూపొందించింది.
- కొత్త విధానంలో ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటారు. అడవిలో పులులు, వన్యప్రాణులు కనిపించినప్పుడు ఫొటోతీయడం, అప్‌లోడ్ చేయడం క్షణాల్లో పూర్తవుతుంది. రూపొందిన సాఫ్ట్‌వేర్‌తో ఆ ప్రాంతంతో సహా వివరాలన్నీ నమోదవుతాయి. మాంసాహార జంతువులు ప్రత్యక్షంగా కనిపించడం తక్కువే. వాటి పాదముద్రలు, ఆధారాలు కనిపిస్తాయి. ఈ ఆనవాళ్లను ఫోన్ యాప్‌లో నమోదు చేస్తారు. రెండో దశలో పులులు తిరిగే అవకాశమున్న చోట కెమెరాలు పెట్టి నమోదు చేస్తారు. 8 రోజుల్లో క్షేత్రస్థాయిలో జంతుగణన పూర్తవుతుంది.
- తెలంగాణలో 2014లో 20 పెద్దపులులు ఉండగా, 2018 నాటికి 26కు పెరిగాయి. దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 2226 నుంచి 2967కి చేరాయి.
ఇవీ చూడండి: ktr: 'జేఎన్‌యూ గోడలపై రాసిన ఆ కొటేషన్ నన్ను రాజకీయాలవైపు నడిపింది'