చెరువులను చెరపట్టి ఇళ్లు నిర్మిస్తున్న ఫలితంగా ఊళ్లు, కాలనీలు నీట మునుగుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్, వరంగల్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కాలనీలు ముంపునకు గురయ్యాయి. చెరువులకు నీళ్లు వచ్చే పాటు కాల్వలు, చెరువుల నుంచి వెళ్లే పంట కాల్వలు, మత్తడి నీరు వెళ్లే నాలాలను మింగేసిన చోట భారీ వరద అకస్మాత్తుగా వస్తోంది. స్థిరాస్తి వ్యాపారం ఊపందుకున్న తరువాత రాష్ట్ర వ్యాప్తంగా వేలాది చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. రాష్ట్రంలో గొలుసు కట్టు చెరువుల వ్యవస్థ ఉండటం వల్ల మధ్యలో చెరువులను పూడ్చినా వరద యథావిధిగా దిగువకు పరవళ్లు తొక్కుతూ తీరని సమస్యగా మారుతోంది.
కనుమరుగవుతున్న నీటివనరులు...
నీటి వనరుల పరిరక్షణకు వాల్టా లాంటి చట్టాలు ఉన్నప్పటికీ పరిరక్షణ చర్యలు లేకపోవడంతో క్రమంగా నీటి వనరులు కనుమరుగవుతున్నాయి. హైదరాబాద్‌లో దాదాపు 180, వరంగల్‌లో 52 చెరువుల రూపురేఖలు మారి నామమాత్రమయ్యాయి. ఇతర జిల్లా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. దీనివల్ల వరద సహజ మార్గంలో పరవళ్లు తొక్కుతూ ఆ ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలను ముంచుతోంది. పట్టణ ప్రణాళికలో భాగంగా వరద నీటి మళ్లింపునకు ప్రత్యేకంగా కాలువలు లేకపోవడం కూడా ముంపునకు ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) ప్రాంతంలో నిర్మాణాలకు పంచాయతీ, పురపాలక సంస్థలు అనుమతులు జారీచేయొద్దు. ఆ భూములను నీటిపారుదల, రెవెన్యూ శాఖలు పరిరక్షించాల్సి ఉన్నా అవి కాలనీలుగా మారుతున్నాయి.
ఇవీచూడండి:రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... జనజీవనం అస్తవ్యస్థం