Largest Electric Auto Factory in Telangana: అమెరికాకు చెందిన ప్రసిద్ధ విద్యుత్ వాహనాల సంస్థ బిలిటీ ఎలక్ట్రిక్ ఇంక్ రాష్ట్రంలో రూ.1,144 కోట్లతో భారీ త్రిచక్ర వాహనాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఏటా 2.4 లక్షల విద్యుత్ వాహనాల తయారీ సామర్థ్యంతో సంగారెడ్డి జిల్లా వెల్మల పారిశ్రామికవాడలో 13.5 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా మూడు వేల మందికి ఉపాధి కల్పించనుంది. ఈ మేరకు సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి మంగళవారం తెలియజేసింది. దీన్ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ స్వాగతించారు. సంస్థకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో వాహనాల తయారీ పరిశ్రమలున్న బిలిటీ తమ సంస్థ విస్తరణలో భాగంగా భారత్‌లోని వివిధ ప్రాంతాలను పరిశీలించి తెలంగాణను ఎంచుకుంది. ఇక్కడ సంస్థకు చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయించింది. తెలంగాణ విద్యుత్ వాహనాల విధానం ఎంతో ఆకర్షణీయంగా ఉందని, మౌలిక వసతులు అత్యుత్తమంగా ఉన్నందున రాష్ట్రాన్ని విద్యుత్ వాహనాల ప్రపంచస్థాయి కేంద్రం(హబ్) మార్చడంలో తాము భాగస్వాములం కావడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని బిలిటీ ఎలక్ట్రిక్ సీఈవో రాహుల్ గాయమ్ వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన గాయమ్ మోటార్ వర్క్స్(జీఎమ్‌డబ్ల్యూ)తో కలిసి పనిచేస్తామని తెలిపారు. 2023లో నిర్మాణాన్ని పూర్తి చేసి, 2024లో ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. కార్గో మోడల్ టాస్క్‌మ్యాన్, ప్యాసింజర్ వెర్షన్ అర్బన్ పేర్లపై త్రిచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తామని చెప్పారు.