గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలోని నగర ప్రాంతాలన్నింటిలో బాలికల జననాలు పరిమితంగా ఉన్నాయి. రాష్ట్రం మొత్తమ్మీద 33 జిల్లాలకు గాను కేవలం ఐదింటిలో మాత్రమే బాలురకన్నా బాలికలు ఎక్కువగా ఉండి లింగ నిష్పత్తిలో ఆదర్శంగా ఉన్నాయి. అవి జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మెదక్, నిజామాబాద్, వికారాబాద్ అని జనగణన శాఖ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 2019 సంవత్సరంలో 4,30,652 మంది అబ్బాయిలు పుట్టగా, 4,10,616 మంది అమ్మాయిలు జన్మించారు. అంటే 4.7 శాతం మంది బాలికలు తక్కువగా ఉన్నారు.
*గ్రేటర్ హైదరాబాద్‌లో కలిసిపోయి ఉన్న రంగారెడ్డి జిల్లాలో లింగ నిష్పత్తి నగర ప్రాంతంలో తక్కువగా ఉంది. అంటే బాలుర కంటే బాలికల సంఖ్య తక్కువ. అధికారిక లెక్కలు.. 1,965 మంది బాలురకు 1,631 మంది మాత్రమే బాలికలు ఉన్నట్టు పేర్కొన్నాయి. ఇదే రంగారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 2,978 బాలురకు 3,066 మంది బాలికలున్నారు.
*గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కలసి ఉన్న మరో జిల్లా మేడ్చల్-మల్కాజిగిరిలో సైతం పల్లె ప్రాంతాల్లో 5,533 మంది బాలురకు 5,672 మంది అమ్మాయిలు ఉంటే మల్కాజిగిరి, కుషాయిగూడ తదితర నగర ప్రాంతాల్లో 26,669 మంది బాలురకు 25,878 మంది బాలికలు ఉన్నారు.