APTF on PRC : పీఆర్సీలో జీతభత్యాలు తగ్గడంతోనే ఉద్యోగులు రోడ్లపైకి వస్తున్నారని.. రాజకీయ పార్టీలో.. మరొకరో తమను ప్రభావితం చేయలేదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, కులశేఖరరెడ్డి స్పష్టం చేశారు. పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఆందోళనలను పక్కదారి పట్టించేలా వైకాపా కేంద్ర కార్యాలయం నుంచి విడుదల చేసిన లేఖ ఉందని విమర్శించారు. అందులోనివన్నీ అసత్యాలేనంటూ ప్రశ్నల వారీగా వైకాపా వాదన.. తమ సమాధానాలను విడుదల చేశారు. వాటి సారాంశం ఇలా..
కొత్త జీతాలు మాకొద్దు.. ఇప్పుడున్నవే కొనసాగించండి
వైకాపా వాదన: కొత్త పీఆర్సీలో జీతాల కోత అవాస్తవం.. రూ.10వేల కోట్లు అదనంగా ఇస్తున్నాం.
ఏపీటీఎఫ్ స్పందన: కొత్త జీతాలు మాకొద్దు. ప్రస్తుత జీతాలు, భత్యాలు కొనసాగించాలని లక్షల మంది కలెక్టరేట్ల ముందు నినదించారు. కొత్త పీఆర్సీతో జీతభత్యాల్లో విధించిన కోతలను ఏ ప్రజావేదిక మీదైనా వివరించగలం. అబద్ధపు ప్రచారాలు ఆపండి.
కారుణ్య నియామకాల్లోనూ వివక్షేనా?
వై: కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి జూన్ 30లోగా నియామకాలు
ఏ: నియామకాలు అడిగింది ప్రాణాలు కోల్పోయిన అందరికీ. మీరు మరణంలోనూ వివక్ష చూపి కేవలం ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు అదీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇస్తున్నారు. షరతులకు లోబడి కారుణ్య నియామకాల ఉత్తర్వులు దశాబ్దాల నుంచి అమల్లో ఉన్నాయి. సంపాదనపరులు మరణించి కుటుంబాలు కకావికలం అయ్యాయి. కరుణ చూపండి, ఉత్తర్వులు వేగంగా అమలు చేయాలనే డిమాండును ఇలా కుదించారు.
రూ.20 లక్షలకు పెంచాల్సిన గ్రాట్యుటీని రూ.16 లక్షలు చేశారు
వై: గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాం
ఏ: ఇది సీలింగ్ పరిమితి. పెంచాల్సింది రూ.20 లక్షలకు. సవరించిన వేతనాలతో ప్రతి ఉద్యోగి సగటున రూ.2-4లక్షలు పొగొట్టుకుంటున్నారు. ఈ ఉత్తర్వులను జనవరి 17 నుంచి వర్తింపచేస్తామనడం మూడున్నరేళ్లుగా పదవీవిరమణ పొందిన ఉపాధ్యాయులు, ఉద్యోగులను నష్టపర్చడమే.
పదవీ విరమణ వయస్సు పెంచి, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
వై: దేశంలో ఎక్కడాలేని విధంగా పదవీవిరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం.
ఏ: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. లక్షలమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని ప్రభుత్వం అందించే వరంగా భావించడం లేదు.
విలీనంతో ఆర్టీసీ ఉద్యోగుల జీవితాలెలా మెరుగుపడ్డాయి?
వై: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపాం.
ఏ: కార్పొరేషన్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినా పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న హక్కులు, రాయితీలు వారు పొందుతున్నారా? కార్పొరేషన్‌లో ఉన్న పరిస్థితి కంటే ప్రస్తుతం వారి జీవితాలు ఎలా మెరుగుపడ్డాయో వివరించగలరా?
మమ్మల్ని ఎవ్వరూ ప్రభావితం చేయలేదు
వై: ప్రతిపక్ష నాయకుడు, వారి అనుకూల పత్రికలకు అమ్ముడుపోయారు.
ఏ: ఇది నిందా ప్రచారం. రాజకీయ పక్షాలో, మరొకరో మమ్మల్ని ప్రభావితం చేయలేదు. ప్రభుత్వాన్ని విశ్వసించాం. విశ్వాసాన్ని దెబ్బతీసేలా జీతభత్యాల కోత ఉత్తర్వులు ఇచ్చారు. వాస్తవాలు గమనించండి. నిందలు ఆపండి. ఉద్యమంలో ఏ రాజకీయ పార్టీనీ అనుమతించకూడదని, వ్యక్తిగత రాజకీయ విశ్వాసాలకు దూరంగా ఉండాలని కమిటీ చేసిన తీర్మానమే ఇందుకు నిదర్శనం.