TSPSC Group 1: రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు శనివారంతో ముగియనుంది. మొత్తం 503 ఉద్యోగాల కోసం ఇప్పటి వరకు 3,63,974 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుత ప్రకటించిన గడువు (మే 31) నాటికి 3,48,095 దరఖాస్తులు వచ్చాయి. చివరి నిమిషంలో ఎక్కువ మంది దరఖాస్తు చేయడం, ఆన్‌లైన్లో ఫీజుల చెల్లింపులో సాంకేతిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో టీఎస్‌పీఎస్సీ దరఖాస్తు గడువును ఈ నెల 4 వరకు పొడిగించింది. గడువు పొడిగింపు తరువాత ఇప్పటి వరకు కొత్తగా 15,879 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు గడువు దగ్గరపడటంతో అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తుకు పోటెత్తారు. సర్వర్‌పై ఒత్తిడి పెరగకుండా, అభ్యర్థులకు సాంకేతిక ఇబ్బందులు రాకుండా కమిషన్, సీజీజీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల చివరి వారం లేదా ఆగస్టులో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, ఈ మేరకు ప్రాథమికంగా టీఎస్‌పీఎస్సీ ప్రకటనలో పేర్కొంది. అయితే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు మరింత సమయం కావాలని నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థి సంఘాల నుంచి కమిషన్‌కు అభ్యర్థనలు వస్తున్నాయి. గ్రూప్-1 ప్రకటన సుదీర్ఘకాలం తరువాత వెలువడిందని, సన్నద్ధమయ్యేందుకు అవకాశమివ్వాలని కోరారు.