ఏపీ రెవెన్యూ లోటు గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకుంది. అక్టోబరుతో ముగిసిన 7 నెలల కాలానికి రూ.48,322.63 కోట్లకు చేరింది. నవంబరు లెక్కలు కూడా కలిపితే లోటు రూ.50వేల కోట్లు దాటినట్లేనని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏనాడూ ఈ స్థాయిలో రెవెన్యూ లోటు లేదు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అంతకు ముందెన్నడూ లేని స్థాయిలో రూ.26,646 కోట్లకు లోటు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 7నెలలకే ఆదాయం కన్నా ఖర్చు అనూహ్యంగా పెరిగింది. దాదాపు రెండు ఆర్థిక సంవత్సరాల నుంచి రెవెన్యూ ఆదాయం అంచనాలతో పోలిస్తే బాగా తగ్గింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది ఇలాంటి ఆర్థిక పరిస్థితులే ఉన్నాయని, కరోనా వల్ల పరిస్థితి మరీ దిగజారిందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
35 శాతమే వసూళ్లు..
సాధారణంగా ప్రతి బడ్జెట్ సమయంలోనూ రెవెన్యూ లోటు తగ్గిస్తామని, ఆదాయంతో పోలుస్తూ ఖర్చును నియంత్రిస్తామని ప్రభుత్వాలు చెబుతుంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఆదాయాలు భారీగా తగ్గినా.. ఖర్చు అంచనాలకు తగ్గట్టుగానే, మరీ చెప్పాలంటే ఇంకా ఎక్కువే చేస్తున్నారు. తొలి 7 నెలల్లో కేవలం 56,798.91 కోట్ల రెవెన్యూ వసూళ్లను ఏపీ సాధించింది. ఏడాది మొత్తానికి రూపొందించిన అంచనాలో ఇది కేవలం 35 శాతమే. ఇదే సమయంలో రెవెన్యూ ఖర్చు 1,05,121.54 కోట్లకు చేరింది. ఏడాది మొత్తానికి రెవెన్యూ ఖర్చు అంచనాలో ఇది 58శాతం.