జగన్ సర్కార్ తీరుపై మరోసారి తీవ్రంగా మండిపడ్డ ఏపీ హైకోర్టు ఏపీ వ్యాప్తంగా పలువురిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని... వారిని కోర్టులో హాజరుపర్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన వివిధ హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం, పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టింగులపై.... అప్పటి ఇన్‌ఛార్జ్ హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని ఆక్షేపించింది. ముఖ్యమైన నిందితుల్ని వదిలేసి... కొందరిపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని పేర్కొంది. సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో గ్రహిస్తున్నామని వ్యాఖ్యానించింది.
ఏపీలో అదుపులో లేని పరిస్థితుల నేపథ్యంలో గతంలో హైకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావిస్తూ వాదనలు వినిపించాలని... ఆ తీర్పులను తమకు సమర్పించాలని హెబియస్ కార్పస్ పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు సూచించింది. వాటి ఆధారంగా రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా నిర్ణయిస్తామని స్పష్టం చేస్తూ.... విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.
విల్ వివాదాల్లో జోక్యం..
వేకువజామున పోలీసులు న్యాయవాది ఇంటికెళ్లడం.. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుని వ్యక్తులపై కేసుల నమోదు చేయడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. తన కుమారుడు రెడ్డి గౌతమ్, కోడలు లోచినిను గతేడాది అక్టోబర్ 28న విజయవాడలో విశాఖ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ రెడ్డి గోవిందరావు దాఖలు చేసిన వ్యాజ్యంలో పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక సీనియర్ కౌన్సిల్ ఎస్ఎస్ ప్రసాద్ వాదనలు కొనసాగించారు. పోలీసులపై పిటిషనర్ ఆరోపణ రుజువు కానందున హైకోర్టు విచారణ అవసరం లేదన్నారు. అక్రమ నిర్బంధానికి గురయ్యారని ఆరోపిస్తున్న వ్యక్తులపై కేసులున్నాయని, వారు క్రిమినల్స్ అని అన్నారు. ఈ కేసును సీబీఐ, మరే ఇతర స్వతంత్ర సంస్థకు దర్యాప్తు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
క్రిమినల్స్ అనడానికి వీల్లేదు..
రెడ్డి గౌతమ్, లోచినిను అక్రమ నిర్బంధం చేయడం హక్కుల్ని కాలరాయడమేనంటూ పిటిషనర్ తరపు న్యాయవాది రవితేజ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కోర్టు విచారణ జరపొచ్చన్నారు. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాక.... పోలీసులు కేసులు నమోదు చేశారని చెప్పారు. కేసుల్లో శిక్షపడకుండా వారిని క్రిమినల్స్ అనడానికి వీల్లేదన్నారు. పిటిషనర్ తరపు మరో న్యాయవాది ఇంటికెళ్లి తనిఖీ చేసినట్లు జ్యుడీషియల్ విచారణ జరిపిన న్యాయాధికారి ముందు పోలీసులు ఒప్పుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తూ.. ప్రస్తుతం కట్టుకథలు చెబుతున్నారని ఆక్షేపించారు. పోలీసుల తప్పు లేకపోతే కొంతమంది పోలీసులపై డీజీపీ చర్యలెందుకు తీసుకున్నారని ప్రశ్నించారు.
వాదనలపై స్పందించిన ధర్మాసనం.. పోలీసులపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రెండు కేసుల్ని సీబీఐకి అప్పగించామని తెలిపింది. పోలీసులు తప్పుచేసినట్లు తేలిందని పేర్కొంది. తమ ముందుకు కేసుల విచారణకు వచ్చాక సైతం.. పౌరుల హక్కుల్ని కాపాడలేకపోతే తాము ఉండి ప్రయోజనం ఏముందని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టింగుల కేసు, ఎస్ఈసీ తొలగింపు తదితర వ్యాజ్యాల్లోని తీర్పులు, ఇతర అంశాల్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టుకు సహకారం అందించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదుల్ని కోరింది.
హైకోర్టు అసంతృప్తి
ఈ సమయంలో అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ.... ఏయే వ్యాజ్యాల్లో ఉత్తర్వుల్ని పరిగణనలోకి తీసుకుంటారో తెలియజేయాలని... వాటిపై స్పందిస్తామన్నారు. ఆ విషయాన్ని నమోదు చేయాలని కోరారు. ఇప్పటికే నమోదు చేశామని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వులు ఏవైనా పరిగణనలోకి తీసుకునే విస్తృత అధికారం న్యాయస్థానానికి ఉందని తెలిపింది. గుంటూరుకు చెందిన ఆదినారాయణ, శ్రీనివాసరావు నిర్బంధం వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సీబీఐ జేడీని పిలిపించి వివరణ కోరతామని హెచ్చరించింది. దీంతో సీబీఐ పీపీ చెన్నకేశవులు కేసు పురోగతిని వివరించారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో త్వరలోనే గురుకుల న్యాయ కళాశాలల ఏర్పాటు