తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఆ వ్యాజ్యాల్లో విచారణ వాయిదా వేయడం కుదరదు' - ఏపీ పోలీసులకు హైకోర్టు వార్నింగ్ న్యూస్

వ్యక్తుల నిర్బంధం వ్యాజ్యాల్లో విచారణను వాయిదా వేయడం కుదరదని ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు తేల్చిచెప్పింది. పోలీసుల తరఫు న్యాయవాది మరోసారి వాయిదా కోరితే అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఒకవేళ వాయిదా అడిగితే.. వాదనలకు పోలీసులు ఆసక్తిగా లేరని భావించి విచారణలో ముందుకెళతామని ఉద్ఘాటించింది. చివరి అవకాశం ఇస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది.

'ఆ వ్యాజ్యాల్లో విచారణ వాయిదా వేయడం కుదరదు'
'ఆ వ్యాజ్యాల్లో విచారణ వాయిదా వేయడం కుదరదు'

By

Published : Nov 19, 2020, 10:09 AM IST

అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్న వారిని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ సందర్భంగా... వాయిదాలు కోరడంపై ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో పోలీసుల తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ కౌన్సిల్ వ్యక్తిగత కారణంతో విచారణకు హాజరుకాలేకపోయినందున విచారణను గురువారానికి వాయిదా వేయాలని జీపీ కోరడంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. సీనియర్ కౌన్సిల్ విజ్ఞప్తి మేరకు పలుమార్లు వాయిదా వేశామని... రోజువారీ విచారణ జరుపుతున్న వ్యాజ్యాల్లో అనవసరంగా వాయిదా వేయకూడదని స్పష్టం చేసింది. సమయం కావాలని జీపీ కోరుతున్నందున చివరి అవకాశంగా విచారణను ఒక్కరోజు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది

అక్రమ నిర్బంధాల వ్యాజ్యాలపై కొన్ని రోజులుగా విచారణ జరిపి.. చివరి నిమిషంలో బదిలీ చేయమని కోరడాన్ని సమర్థించుకోలేమని జస్టిస్ రాకేశ్‌కుమార్‌ అన్నారు. ఏ కేసులోనైనా కోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందో ఎవరికీ తెలియదని.. న్యాయస్థానంలో వినిపించే వాదనలు, కేసు పూర్వాపరాల ఆధారంగా నిర్ణయం ఉంటుందని అన్నారు. తీర్పును రిజర్వు చేసిన తర్వాతైనా మరికొన్ని విషయాలు బయటికొస్తే.. ఎలాంటి నిర్ణయం వెల్లడించాలా? అనే పరిస్థితి జడ్జిలకు తలెత్తుతుందన్నారు. తీర్పును స్టెనోలకు డిక్టేషన్ ఇచ్చే సమయంలో సైతం కోర్టు ఆలోచనా విధానం మారొచ్చన్నారు.

ఈ క్రమంలో కోర్టు నిర్ణయం గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందకూడదన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31న పదవీ విరమణ చేయబోతున్నానని... ఈ దశలో వ్యాజ్యాల్ని బదిలీ చేస్తే తనను తాను క్షమించుకోలేనని జస్టిస్ రాకేశ్‌కుమార్‌ అన్నారు. ఇప్పుడు వ్యాజ్యాల్ని బదిలీ చేస్తే మిగిలిన జీవితకాలమంతా పశ్చాత్తాప పడాల్సి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో వ్యాజ్యాల్ని బదిలీ చేయడం లేదని.. గురువారం నుంచి వాయిదాలు ఇవ్వబోనని స్పష్టం చేశారు. వాదనలు చెప్పాలనుకున్న వాళ్లు చెప్పొచ్చని, లేని పక్షంలో వాదనలు ముగిసినట్లు భావించి తీర్పును వాయిదా వేస్తామన్నారు. సీనియర్ కౌన్సిల్ ఎస్​ఎస్​ ప్రసాద్ వాదనలు వినిపిస్తారా? లేక ఏజీనా? అనే విషయం కోర్టుకు తెలపాలన్నారు. కోర్టు ఆవేదనను అర్థం చేసుకోవాలని.. ఏజీ, సీనియర్ కౌన్సిల్, జీపీ కూడా విచారణలో సహకారం అందించాలని కోరారు.

పిటిషనర్లు సిద్ధంగా ఉండాలి

ఈ వ్యాజ్యాల్లో ఇవాళ్టితో సీనియర్ కౌన్సిల్ వాదనలు ముగిసే అవకాశం ఉన్నందున.. తర్వాతి అంశమైన ఏపీలో రాజ్యాంగ విచ్చిన్నం జరిగిందా? లేదా? అనే విషయంపై వాదనలు చెప్పేందుకు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సిద్ధంగా ఉండాలని జస్టిస్ రాకేశ్ కుమార్ సూచించారు. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు విచ్ఛిన్నం అయ్యాయా? లేదా? అనే అంశంపై వాదనల్లో కోర్టుకు సహకారం అందిస్తామని.. పిటిషనర్ల తరపు న్యాయవాదుల్లో ఒకరైన రవితేజ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ తీరును కోర్టులు తప్పుపట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ, అవన్నీ ఉత్తర్వుల రూపంలో లేవన్నారు. మీ కేసులో వాదనలకే పరిమితం కాకుండా.. ఏపీలోని పరిస్థితుల దృష్ట్యా ఇతర అంశాల్లోనూ సహకారం అందించాలని ధర్మాసనం కోరింది. పలు కేసుల్లో కోర్టు ఇచ్చిన తీర్పులు, పెండింగ్‌లో ఉన్న కేసుల్ని పరిగణించొచ్చని స్పష్టతనిచ్చింది.

ఇదీ చదవండి:సౌకర్యాల కల్పనతో సర్కారీ ఆసుపత్రులకు మహర్దశ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details