స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో నకిలీ చలానాల వ్యవహారంతో ఏపీ ప్రభుత్వం మిగతా శాఖల్లోనూ తనిఖీలు మొదలు పెట్టింది. చలానాల ద్వారా చెల్లించే నగదు జమపై విచారణ చేపట్టింది. నగదు సీఎఫ్‌ఎంస్‌కు జమ అవుతోందా? లేదా? అనే అంశంపై అధికారులు కూపీ లాగుతున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సుమారు రూ.8కోట్ల మేర అక్రమాలు జరగ్గా.. ఇప్పటి వరకు దాదాపు రూ.4కోట్ల వరకు రికవరీ చేశారు. అక్రమాలకు బాధ్యులను చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 14 మంది సబ్‌రిజిస్ట్రార్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఈ క్రమంలో ఆదాయం ఆర్జించే మిగతా శాఖల్లోనూ కొన్ని చోట్ల అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఆయా శాఖల్లోనూ తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. దీనిలో భాగంగా ఎక్సైజ్, మైనింగ్, రవాణా, కార్మికశాఖల్లో అంతర్గతంగా అధికారులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం అవకతవకలు జరిగిన చోట బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశముంది.