కరోనా తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో బయటకు రావడానికే జనం భయపడుతుంటే... బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా మాత్రం ఐసోలేషన్ వార్డులో సేవలందించడానికి కోరిమరీ వచ్చింది.
దిల్లీ వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీ నుంచి శిఖామల్హోత్రా బీఎస్సీ నర్సింగ్‌లో పట్టా పుచ్చుకుంది. నటనపై ఆసక్తితో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. షారూఖ్‌ఖాన్ నటించిన ఫ్యాన్ చిత్రంతో పేరుతెచ్చుకున్న ఈ నటి... కాన్‌చ్లీ అనే చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇప్పుడు నటనని పక్కన పెట్టి... నర్సుగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనుకుంది. ‘
ఇంట్లోవాళ్లు, తెలిసినవాళ్లు నా నిర్ణయం తెలిసి భయపడ్డారు. ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవద్దంటూ సలహాలిచ్చారు. కానీ నాకు మాత్రం నటిగా స్థిరపడినా, మనసులో నా చదువు వృథా అవుతోందనే వేదన ఉండేది. ఇప్పుడు సరైన అవకాశం వచ్చింది. నా మనసు చెప్పినమాటనే వినాలనుకున్నా. బాలా సాహెబ్ థాకరే ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహించడానికి అవకాశం దక్కింది.
ప్రస్తుతం ఐసోలేషన్ వార్డులో రోగులకు సేవలందించే అదృష్టం లభించింది. రాత్రిపగలు తేడాలేకుండా ప్రజల కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ ఆసుపత్రుల్లోని వైద్యసిబ్బంది విధుల్లో మునిగితేలుతున్నారు. దయచేసి ఇంటి నుంచి ఎవరూ బయటికి రావద్ధు మీరందరూ క్షేమంగా ఉంటేనే మేమూ బాగుంటాం అనే ఈమె... సామాజిక సేవ చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరుతోంది.