Viveka Murder Case: ‘మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి ఇంటివద్ద నైట్ వాచ్‌మన్‌గా పనిచేసే పి.రాజశేఖర్ 2019 మార్చి 13, 14, 15 తేదీల్లో కాణిపాకం వెళ్తున్నారంటూ ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి.. ఎర్ర గంగిరెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆ మూడు రోజుల్లోనే వివేకాను చంపేయాలని, అందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని గంగిరెడ్డి నాతోనూ, సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలతోనూ చెప్పారు’ అని ఈ కేసులో నిందితుడు, అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి వెల్లడించారు. వివేకా హత్యకు 2019 ఫిబ్రవరి 10న గంగిరెడ్డి ఇంట్లోనే ప్రణాళిక రూపొందిందని చెప్పారు. వివేకా ఇంటి లోపలికి వెళ్లటానికి నైట్ వాచ్‌మన్ రాజశేఖర్, జిమ్మి అనే కుక్కే అడ్డంకిగా ఉంటాయని ఆ సందర్భంలో తాను ఎర్ర గంగిరెడ్డితో చెప్పానని పేర్కొన్నారు. అయితే వివేకా పీఏ కృష్ణారెడ్డితో మాట్లాడి, వాచ్‌మన్‌ను అక్కడ లేకుండా చేస్తానని గంగిరెడ్డి చెప్పారన్నారు. తర్వాత 2019 మార్చి 1 నుంచి గంగిరెడ్డి వివేకా వెంటే ఉంటూ.. ఆయన ఎప్పుడు, ఎక్కడికి వెళుతున్నారనే విషయాల్ని సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలతో పాటు తనకూ చెప్పేవాడని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న సీఆర్‌పీసీలోని సెక్షన్ 306(4)(ఏ) కింద పులివెందుల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆ ప్రతులు తాజాగా వెలుగుచూశాయి. అందులోని ప్రధానాంశాలివీ..
మేం ఉన్నామని చెప్పాం కదా..
వివేకాను చంపాలని ఎర్ర గంగిరెడ్డి చెప్పిన రెండు, మూడు రోజుల తర్వాత సునీల్‌యాదవ్ ఓ రోజు నాకు కోటి రూపాయలు ఇచ్చారు. ఇంత డబ్బు ఎవరిచ్చారని అడిగాను. ‘దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి.. ఎర్ర గంగిరెడ్డికి ఇస్తే ఆయన నాకు ఇచ్చాడు’ అని సునీల్ చెప్పాడు. ఆ తర్వాత వివేకానందరెడ్డిని హత్య చేయాలా? వద్దా? అనేది నిర్ధారించుకోవడానికి నేను సునీల్‌ను సంప్రదించాను. అతను నన్ను ఎర్ర గంగిరెడ్డి ఇంటికి తీసుకెళ్లి, శివశంకర్‌రెడ్డికి ఫోన్ చేశాడు. శివశంకర్‌రెడ్డి నాతో ఫోన్లో మాట్లాడుతూ.. ‘ఎర్ర గంగిరెడ్డి ఎలా చెబితే అలా చేయండి. మేం ఉన్నామని చెప్పాం కదా. మళ్లీ అనుమానం ఎందుకు?’ అని ప్రశ్నించారు.
డబ్బులు కావాలంటే అడగమన్నారు..
* వివేకా హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత నేను, సునీల్, ఉమాశంకర్‌రెడ్డి... ఈశ్వరయ్యతోటలో కడప ఎంపీ వై.ఎస్.అవినాష్‌రెడ్డి తండ్రి వై.ఎస్.భాస్కర్‌రెడ్డిని, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని కలిశాం. సీబీఐకి కేసు అప్పగించారు కదా.. మా పరిస్థితి ఏంటని అడిగాం. ‘మేం చూసుకుంటాం లే. ఇబ్బంది లేదు. డబ్బులేవైనా కావాలంటే అడగండి ఇస్తాం’ అని వారు మాతో అన్నారు.
*2020 మార్చి 3న దిల్లీలో విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నాకు నోటీసిచ్చింది. దాన్ని పట్టుకుని బయపురెడ్డి ఇంట్లో శివశంకర్‌రెడ్డిని కలిశాను. ‘సీబీఐ వాళ్లు ఎంత కొట్టినా మా పేర్లు బయటపెట్టకు. నీకు కావాల్సినంత డబ్బిస్తాం. జీవితం సెటిల్ చేస్తాం. నీతో పాటు భరత్‌యాదవ్ కూడా దిల్లీ వస్తాడు. సీబీఐ అధికారులు నిన్ను ఏం అడుగుతున్నారో ఆ వివరాలు మాకు చెబుతాడు’ అని శివశంకర్‌రెడ్డి, బయపురెడ్డి, విద్యారెడ్డిలు నాతో చెప్పారు. నాలుగైదు రోజులపాటు భరత్ నాతోపాటు దిల్లీలోనే ఉన్న తర్వాత సీబీఐ అధికారులకు అనుమానం వస్తుందేమోనని పులివెందులకు వచ్చేశాడు. నేను దిల్లీలో రెండున్నర నెలలున్నా సీబీఐ అధికారులకు నిజం చెప్పలేదు. పులివెందులకు తిరిగొచ్చిన తర్వాత నన్ను కలిసి దిల్లీలో సీబీఐ అధికారులతో ఏం చెప్పావు? అని ఆరా తీశారు.
వాంగ్మూలం ఏమిచ్చావని శివశంకర్‌రెడ్డి అడిగారు