తెలంగాణ

telangana

ETV Bharat / city

Tention At Guntur: రణరంగంగా మారిన దుగ్గిరాల.. లోకేశ్​పై దాడికి యత్నం - duggirala stone pelting news

Tention At Guntur: ఏపీ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా నేత లోకేశ్ గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న వైకాపా శ్రేణులు.. తెదేపా శ్రేణులతో వాగ్వాదానికి దిగారు.

Tention At Guntur
Tention At Guntur

By

Published : Apr 28, 2022, 7:46 PM IST

Tention At Guntur: ఏపీ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా నేత లోకేశ్ గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న వైకాపా శ్రేణులు.. తెదేపా శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు.., తెదేపా వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. లోకేశ్​తో పాటు తెదేపా శ్రేణుల పైకి వైకాపా శ్రేణులు రాళ్లు విసిరారు. అడ్డుకున్న పోలీసులు వైకాపా శ్రేణులను నిలువరించారు. దాడిలో ఎమ్మెల్యే ఆర్కే డ్రైవర్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

రణరంగంగా మారిన దుగ్గిరాల.. లోకేశ్​పై దాడికి యత్నం

రాష్ట్రంలో మాఫియా రాజ్యం విచ్చలవిడిగా నడుస్తోందని ప్రభుత్వంపై లోకేశ్‌ మండిపడ్డారు. న్యాయం కోసం వస్తే తమపై వైకాపా శ్రేణులు రాళ్లు విసిరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాళ్లు విసిరితే పారిపోతామని అనుకుంటున్నారా? అని వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పది మంది మూకను నియంత్రించలేని స్థితిలో రాష్ట్ర పోలీసులు ఉన్నారన్నారు. తెదేపా శ్రేణులపై రాళ్లు విసురుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కొందరు పోలీసుల వల్ల పోలీసు వ్యవస్థకే చెడు పేరు వస్తోందన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలిస్తే నోటీసులు పంపుతున్నారని అన్నారు.

వైకాపా నేతలకు చట్టాలపై గౌరవం, భయం లేని పరిస్థితి ఏర్పడిందని లోకేశ్‌ ఆక్షేపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక 800 మంది మహిళలపై దాడి జరిగిందన్నారు. దాడులు జరిగితే బుల్లెట్‌ కన్నా వేగంగా వస్తానన్న జగన్‌ ఎక్కడ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున మహిళలపై దాడులు జరుగుతున్నాయని వాపోయారు. నిన్న కొందరు మద్యం సేవించి మహిళపై దాడి చేసి హత్య చేశారన్నారు. మృతురాలి బంధువులు ఫిర్యాదు చేసినా కేసులు పెట్టట్లేదన్నారు. రాష్ట్రంలో జగన్‌ తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందా? అని లోకేశ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో లేని దిశా చట్టం ఉందని చిత్రీకరిస్తున్నారని ఆక్షేపించారు. బాధిత కుటుంబానికి న్యాయం కోసం ఇక్కడికి వచ్చానన్నారు.

"ప్రభుత్వానికి 21 రోజులు గడువు ఇస్తున్నా. దిశా చట్టం కింద ముగ్గురు నిందితులపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధించాలి. శవపరీక్ష కాకముందే అత్యాచారం జరగలేదని ఎస్పీ ఎలా చెప్పారు. ఎస్పీతో ఎవరెవరు మాట్లాడారో కాల్‌డేటా రికార్డులు బయటపెట్టాలి. తనపై ఎవరి ఒత్తిడి ఉందో ఎస్పీ సమాధానం చెప్పాలి. రహస్య ఒప్పందాలపై వివరాలు బయటపెట్టాలి. మహిళలను కించపరిచేలా రోజా మాట్లాడటం సరికాదు. నాకు చీర పంపుతానని రోజా చెబుతున్నారు. రోజా పంపిన చీరను నా తల్లి, ఆడపడుచులకు ఇస్తా. కించపరిచేలా మాట్లాడిన రోజా మహిళలకు క్షమాపణ చెప్పాలి. మహిళలను కించపరిచేలా మాట్లాడినవారిపై కేసులు పెట్టాలి. మహిళా కమిషన్‌కు చిత్తశుద్ధి ఉంటే కేసులు పెట్టాలి. ఘటన వెనక వైకాపా నేతలు ఉన్నట్లు అనిపిస్తోంది. కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి తెదేపా అండగా ఉంటుంది." -లోకేశ్‌, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details