ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పల్నాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మారెళ్లవారి పాలెం, ఇనిమెల్ల గ్రామాల్లో తలెత్తిన వివాదాలు పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగాయి. జండ్ల మండలం ములకలూరులో ఫలితాలు వెలువడిన తర్వాత ప్రజలు ఇళ్లకు వెళ్తుండగా వివాదం తలెత్తింది. అది ఇరువర్గాల మధ్య రాళ్లదాడికి దారి తీసింది. ఈ ఘటనలో తెలుగుదేశం కార్యకర్తలు గాయపడ్డారు. పల్నాడులో ఓ ప్రాంతానికి రెండో దశ ఎన్నికలు ముగియగా... మరో ప్రాంతానికి మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 15వేల మందిని పోలీసులు బైండోవర్ చేశారు. తెలుగుదేశం మద్దతుదారులను బెదిరించి బలవంతపు ఏకగ్రీవాలకు అధికార పార్టీ పాల్పడుతోందని.. ఆ పార్టీ నేత జీవీ ఆంజనేయులు విమర్శించారు.
జీవీ ఆంజనేయులు, తెదేపా నేత
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా వంగర మండలం శ్రీహరిపురంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఇరువర్గాల పోరుగా మారింది. రెండో దశ పల్లె పోరులో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడంతో... ఇద్దరి వ్యక్తుల మధ్య మాటామాటా పెరిగి వివాదానికి దారితీసింది. వీరఘట్టం మండలం కంబరలో ఇరువర్గాల దాడిలో ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలు గాయపడ్డారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం అడ్డాపు శిల పంచాయతీ బంట వాని వలసలో యువకులపై దాడి జరిగింది. వైకాపా బలపరిచిన అభ్యర్థి విజయానికి సహకరించారని కోపంతో ప్రత్యర్థి అభ్యర్థి వర్గీయులు దాడి చేశారని బాధితులు వాపోయారు.