హైదరాబాద్ ముషీరాబాద్‌లోని కేర్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చిన గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల బాధితురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు. ఆ గర్భిణికి పుట్టిన శిశువు రెండ్రోజులకే మృతి చెందగా.. బాలింత పరిస్థితి కూడా విషమంగా మారింది. 10 రోజులుగా ఆమెకు చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రూ.22 లక్షలు వసూలు చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇంకా డబ్బుల కోసం ఆస్పత్రి యాజమాన్యం వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శిశువు మృతి.. బాలింత పరిస్థితి విషమం..
ముషీరాబాద్ పార్శిగుట్టలో నివాసముంటున్న డి. శిల్ప(28)కు పురిటి నొప్పులు రాగా ఈ నెల 16న కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వెంటనే ఆస్పత్రి వైద్యులు శిల్పకు ఉమ్మి నీరు తక్కువగా ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని ఆమె భర్త ప్రభాకర్‌కు తెలిపారు. అదేరోజు ఆపరేషన్ చేసి పురుడు పోశారు. పుట్టిన శిశువు పరిస్థితి విషమంగా ఉండటం వల్ల వెంటనే నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఆ శిశువు రెండో రోజునే మృతి చెందింది. మరోవైపు.. శిల్ప ఆరోగ్య పరిస్థితి బాగాలేదని.. ఆమెకు రక్తం తక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలుకు 22 మంది కుటుంబ సభ్యులు రక్తదానం చేశారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోగా.. ఇంకా విషమించింది. వెంటనే ముషీరాబాద్ కేర్ ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికి కూడా తన భార్య ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉందని.. వైద్యులను ఆరా తీస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వైద్యుల నిర్లక్ష్యపు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబీకులు ఆందోళకు దిగారు.