Tension in Kuppam ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనకు తొలిరేజే ఆటంకాలు సృష్టించిన వైకాపా.. రెండో రోజు మరింత అలజడికి యత్నిస్తోంది. నిన్నటి రామకుప్పం పర్యటనలో తమపై దాడి చేశారంటూ నిరసన ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈమేరకు కార్యకర్తలంతా కుప్పం రావాలని వైకాపా నాయకులు వాట్సప్ సందేశాలు పంపారు. అలాగే ప్రైవేటు విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు.. చలో కుప్పం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు నియోజకవర్గంలోని శ్రేణులు తరలిరావాలని కోరారు.
ఇరు పార్టీల సవాళ్లు, నిన్నటి పరిణామాల దృష్ట్యా.. పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి అదుపు తప్పకుండా బస్టాండ్ సహా కుప్పంలోని ప్రధాన ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. ఆర్టీసీ బస్సులను ఆపివేయించారు. దీనివల్ల బస్సులు డిపోకే పరిమితం కావడంతో.. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కుప్పంలో ఆధునికీకరించిన పార్టీ కార్యాలయంతో పాటు నూతనంగా ఏర్పాటుచేసిన అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవాల్లో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. ఆ తర్వాత కార్యకర్తల సమావేశానికి హాజరయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే.. వైకాపా నిరసనల దృష్ట్యా చంద్రబాబు కార్యక్రమాల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది.
వైకాపా నిరసన ర్యాలీ.. ఏపీలో నిన్నటి రామకుప్పం పర్యటనలో తమపై దాడి చేశారంటూ నిరసన ర్యాలీ చేపట్టిన వైకాపా నాయకులు, కార్యకర్తలు.. తెలుగుదేశం కార్యాలయం వైపు దూసుకెళ్లారు. పోలీసులు అడ్డుకుంటున్నా లెక్కచేయకుండా కార్యాలయం వైపు వెళ్లారు. ఎన్టీఆర్ విగ్రహం వద్దనున్న తెలుగుదేశం కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. అలాగే ప్యాలెస్ రోడ్డులో తెలుగుదేశం బ్యానర్లు, కటౌట్లు ధ్వంసం చేయగా.. బస్టాండ్ వద్ద ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ ఫ్లెక్సీని చించివేశారు. వైకాపా నాయకులు వాట్సప్ సందేశాలతో తరలివచ్చిన కార్యకర్తలు.. నియోజకవర్గ ఇన్ ఛార్జి భరత్ కార్యాలయం నుంచి డీసీసీబీ వరకు ర్యాలీ చేస్తూ హంగామా చేస్తున్నారు. ఈలలు, కేకలు వేస్తూ హల్ చల్ చేస్తున్నారు.