బంజారాహిల్స్ అంబేద్కర్‌నగరర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇళ్లను కూల్చి వేయడానికి వచ్చిన జీహెచ్‌ఎంసీ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఒక దశలో స్థానికులు, అధికారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆగ్రహంతో కొందరు స్థానికులు అధికారులపై రాళ్లు రువ్వారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అక్కడ నుంచి పంపించివేసి బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉద్రిక్తత.. ముగ్గురి ఆత్మహత్యాయత్నం
14:18 November 12
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉద్రిక్తత.. ముగ్గురి ఆత్మహత్యాయత్నం
బంజారాహిల్స్ అంబేడ్కర్‌నగర్ రోడ్డు నెంబర్ 13లో ఇద్దరు అన్నదమ్ములు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. సమీపంలో ఉండే మోహన్‌రెడ్డి అనే వ్యక్తి... ఇళ్ల నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు అక్కడకు చేరుకొని ఇంటిపై కప్పు కొంత మేరకు కూల్చివేశారు. ఒక్కసారిగా ఇంటి యజమానులు సహా స్థానికులు గుమిగూడి అధికారులతో వాగ్వాదానికి దిగారు. రాళ్లు రువ్వడం వల్ల వారి మధ్య తోపులాట జరిగింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇంటిని ఎలా కూలుస్తారంటూ... ప్రశ్నించారు. కూల్చివేతలు నిలిపివేయాలంటూ ఇంటి యజమానులు, కొంత మంది మహిళలు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలువరించారు.
గతంలోనే ఈ విషయంపై మోహన్‌రెడ్డి ఫిర్యాదుతో మూడు అంతస్తులు నిర్మించాల్సి ఉండగా... దాన్ని రెండంతస్తులకు కుదించినట్టు ఇంటి యజమాని తెలిపాడు. మరోసారి ఫిర్యాదు చేయడం వల్ల అధికారులు కూల్చేందుకు వచ్చారని... కానీ నోటీసులు ఇవ్వకుండా ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఎటువంటి ఫిర్యాదు అందనందున... కేసు నమోదు చేయలేదని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కళింగరావు తెలిపారు. ముందు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు.