Tension At Gudivada Police Station: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్‌పై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కృష్ణాజిల్లా గుడివాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నతెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గుడివాడ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులను తోసుకుంటూ తెదేపా నాయకులు స్టేషన్‌కు వచ్చారు.
ఈ క్రమంలో తెదేపా శ్రేణుల తోపులాటలో పోలీసులు కిందపడ్డారు. తెదేపా నాయకులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య గుడివాడ వెళ్తుండగా మార్గం మధ్యలో పోలీసులు వారిని నిలువరించారు. కంకిపాడు టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాహనాన్ని ఆపి గుడివాడ వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. గద్దె రామ్మోహన్‌ను ఉంగుటూరు స్టేషనుకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యను పమిడిముక్కల స్టేషన్‌కు తీసుకెళ్లారు. పామర్రులోను తెలుగుదేశం నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త నెలకొంది.