తెలంగాణ

telangana

కరోనా అంటే.. ఖాళీ చేయాలంటున్నారు!

కొవిడ్‌-19తో కలిసి బతకాల్సిందేనని పాలకులు, వైద్యులు సూచిస్తుంటే.. ఇంకోవైపు కిరాయికి ఉంటున్న వారిపట్ల గృహ యజమానులు కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. అద్దెకు ఉంటున్నవారు ఎవరైనా కరోనా బారిన పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడుతున్న పరిస్థితి పలుచోట్ల కనిపిస్తోంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో ఈ తరహా వైఖరి బాధితులను కలవరపెడుతోంది.

By

Published : Jun 15, 2020, 5:49 AM IST

Published : Jun 15, 2020, 5:49 AM IST

కరోనా అంటే.. ఖాళీ చేయాలంటున్నారు!
కరోనా అంటే.. ఖాళీ చేయాలంటున్నారు!

ఖైరతాబాద్‌లోని ఓ గల్లీలో అద్దెకు ఉండే వ్యక్తిలో కరోనా తరహా లక్షణాలు కనిపించాయి. ఆసుపత్రికి వెళ్లి పరీక్షకు నమూనాలు ఇచ్చి వచ్చాడు. తర్వాత బయటికి రాకుండా ఇంట్లో క్వారంటైన్‌లో ఉండిపోయాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు ఇంటి యజమానిని పిలిచి నానా హడావుడి చేశారు. దీంతో ఇంటి యజమాని ఆ కుటుంబాన్ని ఖాళీ చేయించాడు. తర్వాత బాధితుడికి పరీక్షలో నెగిటివ్‌ వచ్చినా.. చేసేదేమీ లేకపోయింది.

  • కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి భద్రాద్రి జిల్లాలోని ఓ మండల కేంద్రంలో ఉన్న అత్తగారింటికి వెళ్లిన అల్లుడికి చేదు అనుభవం ఎదురైంది. ఇంటి నుంచి నాలుగు రోజుల పాటు ఆయన బయటకు రాకపోవడంతో అనుమానించిన పొరుగువారు ఆ ఇంటిపై దాడి చేసినంత పని చేశారు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోక తప్పలేదు.
  • భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలంలోని ఓ గ్రామానికి హైదరాబాద్‌ నుంచి వచ్చిన కుటుంబాన్ని గ్రామస్థులు అనుమతించలేదు. దీంతో వారు ఖమ్మంలోని ఓ దేవాలయంలో 14 రోజులు ఉండి భయంభయంగా ఇల్లు చేరారు.

కొవిడ్‌-19తో కలిసి బతకాల్సిందేనని పాలకులు, వైద్యులు సూచిస్తుంటే.. ఇంకోవైపు కిరాయికి ఉంటున్న వారిపట్ల గృహ యజమానులు కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. అద్దెకు ఉంటున్నవారు ఎవరైనా కరోనా బారిన పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడుతున్న పరిస్థితి పలుచోట్ల కనిపిస్తోంది. ఎక్కడైనా పాజిటివ్‌ కేసు నమోదైతే సాధారణంగా ఆ చుట్టుపక్కల పరిస్థితిని వైద్య బృందాలు పరిశీలించి నమూనాలు సేకరిస్తాయి. వారిని కలిసిన వారి వివరాలు ఆరాతీస్తాయి. ప్రస్తుతం ఇది అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి అవస్థలు తెచ్చిపెడుతోంది. కరోనా పాజిటివ్‌ బాధితులను, లక్షణాలున్న వారిని క్వారంటైన్‌కు తరలించడం ఆలస్యం.. ఇంటి యజమానులు ఆ కుటుంబాన్ని ఇల్లు ఖాళీ చేయాలని హుకుం జారీచేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో ఈ తరహా వైఖరి బాధితులను కలవరపెడుతోంది.

ప్రజలను చేరని కొత్త నిబంధనలు..

కరోనా నిర్ధారణ అయినా.. లక్షణాలు కనిపించని వారిని ఇంటి వద్దే క్వారంటైన్‌లో ఉండాలని ప్రస్తుతం వైద్యులు సూచిస్తున్నారు. ప్రత్యేకమైన గది ఉంటే ఇంటి వద్దే ఉండి చికిత్స తీసుకోవాలని, తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. చాలా మంది ఇళ్లలో క్వారంటైన్‌లో ఉంటున్నారు. కానీ, కిరాయి ఇళ్లలో ఉంటున్న వారు కొందరు యజమానుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. చుట్టుపక్కల వారి నుంచి వస్తున్న విమర్శలతో.. యజమానులు బాధిత కుటుంబాన్ని పూర్తిగా దూరం పెడుతున్నారు. సాధారణ వ్యాధులు సంక్రమించినా కరోనా కిందే జమకడుతూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు బస్తీల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో పరీక్షలకు కూడా జనం వెనకాడుతున్నట్లు పలువురు చెబుతున్నారు. పరిస్థితి తీవ్రమైనప్పుడు మాత్రమే ఆసుపత్రి మెట్లు ఎక్కుతున్నారని చెబుతున్నారు.

కేసుల సంఖ్య పెరగడంతోనే..

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎవరి ద్వారా వైరస్‌ సంక్రమిస్తుందోననే భయం అందరిలో కనిపిస్తోంది. దీని కారణంగా సామూహిక నివాస గృహాలు ఉన్నచోట, యజమానులు నివసిస్తూ అదే భవనంలో పోర్షన్లను అద్దెకిచ్చిన చోట యజమానులు ఒకింత కఠినంగా వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తోంది. దీంతో అద్దెకు ఉంటున్నవారు సాధారణ జలుబు, దగ్గు వచ్చినా తలుపులు వేసుకుని మసలుకుంటున్నారు.

ఇవీ చూడండి:విదేశీ టూ స్వదేశీ... వయా మహేశ్...

ABOUT THE AUTHOR

...view details