తెలంగాణ

telangana

ETV Bharat / city

మామిడిని మగ్గబెట్టేందుకు.. తాత్కాలిక పద్ధతుల వైపే మొగ్గు

తేనెలూరే తియ్యని మామిడిపండు అంటే ఎవరికిష్టం ఉండదు! అవి సహజంగా పండితే మధుర రసం పంచుతాయి.. రుచితో మైమరిపిస్తాయి.. కానీ, మామిడికాయలను పండ్లుగా మార్చేందుకు వ్యాపారులు ఎక్కువ మంది తాత్కాలిక పద్ధతులనే ఆశ్రయిస్తున్నారు. ప్లాస్టిక్‌ బుట్టలో 20 కిలోల మామిడికాయలు.. వాటి మధ్య ‘ఎన్‌-రైప్‌’ పొడి ప్యాకెట్లు ఉంచుతున్నారు. తెలంగాణలోని పలు పెద్ద మార్కెట్ల నుంచి ఇతర రాష్ట్రాలకు లారీల్లో వెళ్తున్న మామిడికాయలను మాగపెట్టేందుకు నిత్యం ఈ ప్యాకెట్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు.

temporary methods to ripening mangoes in telanganatemporary methods to ripening mangoes in telangana
మామిడిని మగ్గబెట్టేందుకు.. తాత్కాలిక పద్ధతుల వైపే మొగ్గు

By

Published : Apr 10, 2021, 6:48 AM IST


ఏ కాయనైనా తెంపిన తరవాత ఒకరోజు గది ఉష్ణోగ్రతలో నీడలో ఉంచాలి. అనంతరం ‘మాగపెట్టే కేంద్రాల్లో’ (రైపనింగ్‌ ఛాంబర్లలో) కనీసం 2 రోజులుంచాలి. ఇందులో 100 పీపీఎం ఇథిలీన్‌ వాయువును పలు దఫాలుగా వదులుతారు. దీంతో మామిడికాయలు బంగారు వర్ణంలోకి మారతాయి. ఈ కేంద్రంలో నుంచి తీసిన తరవాత కాయలో వేడి తగ్గించడానికి మరో రోజు 20 నుంచి 22 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే శీతలగదిలో ఉంచాలి. తోటలో కోసిన రోజు నుంచి ఇలా మాగపెట్టి మార్కెట్‌కు పంపడానికి 5 రోజుల సమయం పడుతుంది. ఇంత సమయం వేచి ఉండలేక.. ఒకటీ రెండు రోజుల్లో మగ్గిపోయే ఎన్‌-రైప్‌ ప్యాకెట్ల వాడకం పెరిగింది.

ఇదీ పరిస్థితి..

* రాష్ట్రంలో మొత్తం 212 రైపనింగ్‌ ఛాంబర్లు ఉన్నాయి. వీటిని రైతులు, వ్యాపారులు పెద్దగా వాడటం లేదు. ఎక్కువగా అరటి పండ్లకే వాడుతున్నారు.
* హైదరాబాద్‌లోని గడ్డి అన్నారం మార్కెట్‌లో గతంలో మార్కెటింగ్‌ శాఖ రెండు రైపనింగ్‌ ఛాంబర్లు నిర్మించింది. వీటిలో రైతులు మామిడికాయలను ఉచితంగా పెట్టుకోవచ్చని, శాస్త్రీయంగా మాగపెడితే మంచి ధర వస్తుందని సూచించింది. రైతులెవరూ వాడుకోకపోవడంతో ప్రస్తుతం ఓ వ్యాపారికి అద్దెకిచ్చింది. ప్రస్తుతం ఎక్కువగా ఖాళీగానే ఉంటోంది.
* ఎన్‌-రైప్‌ ఆరోగ్యానికి హాని చేయదని ఉద్యాన శాఖ గతంలో ప్రకటించడంతో వినియోగం భారీగా పెరిగిందని ఓ టోకు వ్యాపారి ‘ఈనాడు’కు తెలిపారు.
* శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థ తయారుచేస్తున్న ఎన్‌-రైప్‌కు తాజాగా ‘మేధోపరమైన హక్కు’ (పేటెంట్‌) వచ్చిందని తయారీదారు కె.ఎస్‌.రవికుమార్‌ ‘ఈనాడు’కు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గతేడాది 36 లక్షల ప్యాకెట్లు విక్రయించామని.. ఈ సీజన్‌లో 2 కోట్లు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఖర్చు, సమయం ఆదా అవుతుందని..

"ఈ సీజన్‌లో 3 లక్షల ఎకరాల నుంచి 12 లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తుందని అంచనా. గతేడాది 9 లక్షల టన్నులు రాగా.. ఈ సారి దిగుబడి పెరుగనుంది. మామిడికాయలను రైపనింగ్‌ ఛాంబర్‌లో మాగపెట్టాలంటే అన్ని ఖర్చులు కలిపి క్వింటాకు రూ.500 దాకా వ్యాపారి చెల్లించాల్సి వస్తోంది. ఎన్‌-రైప్‌ ప్యాకెట్‌ను రూ.6కి కొని 20 కిలోల కాయల్లో పెట్టేస్తే రెండు రోజుల్లో బంగారు రంగులోకి రాగానే మార్కెట్‌లో అమ్మకానికి పంపుతున్నారు. వేగంగా పండించడానికి వ్యాపారులు దీనిని విరివిగా వాడుతున్నారు." -ఎల్‌.వెంకట్రాంరెడ్డి, ఉద్యానశాఖ సంచాలకుడు

కాస్తంత శ్రద్ధ పెడితే మంచి ధర

"మహారాష్ట్రలో ద్రాక్ష, మామిడి, కశ్మీర్‌లో యాపిల్‌ కాయలను మాగపెట్టడానికి రైపనింగ్‌ ఛాంబర్లు, ప్యాక్‌హౌస్‌లు పెద్దయెత్తున నిర్మించారు. నాణ్యత, మన్నిక ఎక్కువ ఉండటంతో విదేశాల్లో మంచి ధరలు పలుకుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఛాంబర్లు, ప్యాక్‌హౌస్‌లను అభివృద్ధి చేయడం లేదు. మహారాష్ట్రలో పండే అల్ఫోన్సా రకం కన్నా తెలుగు రాష్ట్రాల్లో పండే బంగినపల్లి, పెద్ద రసాలు బాగా రుచిగా ఉంటాయి. అయితే మాగపెట్టే, ప్యాకింగ్‌ ప్రక్రియ సరిగా లేక సరైన ధర రావడం లేదు. చెట్టు నుంచి ఒక అంగుళం పొడవు తొడిమతో కాయను తెంచి రైపనింగ్‌ ఛాంబర్‌లో పెడితే పండిన తరవాత ఎక్కువ కాలం మన్నికగా నిల్వ ఉంటాయని మా పరిశోధనలో తేలింది." -రోజాచంద్‌, మామిడికాయల రైపనింగ్‌ నిపుణుడు

ఇదీ చూడండి: కొవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం- నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details