తెలంగాణ

telangana

ETV Bharat / city

UMKS FIRST DOCTORATE: చరిత్రలో తొలి డాక్టరేట్‌ సాధించిన తెలుగు కుర్రాడు - UMKS FIRST DOCTORATE LATEST NEWS

ఏపీలోని విశాఖ మన్యం కుర్రాడు అగ్రరాజ్యంలో తన సత్తాచాటాడు. తెలుగు తేజం కీర్తిని ఎల్లలు దాటేలా చేశాడు. మన్యం యువకుడు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరి, కాన్సాస్ సిటీ (UMKS) నుంచి డాక్టరేట్​ను సాధించాడు. యూఎంకేఎస్ చరిత్రలో తొలి డాక్టరేట్ సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా భరద్వాజ రికార్డు సృష్టించాడు.

UMKS FIRST DOCTORATE: యూఎంకేఎస్‌ చరిత్రలో తొలి డాక్టరేట్‌ సాధించిన మన్యం కుర్రాడు
UMKS FIRST DOCTORATE: యూఎంకేఎస్‌ చరిత్రలో తొలి డాక్టరేట్‌ సాధించిన మన్యం కుర్రాడు

By

Published : Jul 21, 2021, 9:42 AM IST

Updated : Jul 21, 2021, 9:53 AM IST

తెలుగు తేజం కీర్తి ఎల్లలు దాటింది. ఖగోళ భౌతిక శాస్త్రంలో జరిపిన పరిశోధనలకు సీలేరుకు చెందిన కామేశ్వర భరద్వాజ మంథా అగ్రరాజ్యం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరి, కాన్సాస్‌ సిటీ (యూఎంకేఎస్‌) డాక్టరేట్‌ను సాధించారు. యూనివర్సిటీ చరిత్రలో ఖగోళ భౌతిక శాస్త్రంలో డాక్టరేట్‌ సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా భరద్వాజ రికార్డు సాధించారు.

భరద్వాజ సీలేరు ఏపీ జెన్‌కోలో సహాయ కార్యనిర్వాహక ఇంజినీరు కామేశ్వర శర్మ కుమారుడు. ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్‌లో సాగింది. విజయవాడలో నారాయణ ఐఐటీ అకాడమీ (Narayana IIT Academy)లో ఇంటర్‌ చదివాడు. కె.ఎల్‌.యూనివర్సిటీలో ఈసీఈలో బీ.టెక్‌ పూర్తిచేశారు. అనంతరం 2014లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. యూఎంకేఎస్‌ ఎనిమిది గంటల పాటు నిర్వహించిన అర్హత పరీక్షల్లో ప్రథమస్థానం సాధించి పరిశోధనలకు ఎంపికయ్యారు. మొదటి నుంచి ఖగోళ భౌతిక శాస్త్రం మీద ఉన్న ఆసక్తితో విశ్వంలో నక్షత్ర మండలాలు ఢీకొనే క్రమంలో సంభవించే పరిణామాలపై పరిశోధనలు కొనసాగించారు.

విశ్వంలో ఆండ్రోమెడా నక్షత్ర మండలాలు (Andromeda constellations) కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత పరస్పరం ఢీకొననున్నాయి. అన్ని నక్షత్ర మండలాలు వేర్వేరు సమయాల్లో తారస పడతాయి. అవి ఏ క్రమంలో ఎదురుపడతాయి?, ఢీకొంటే ఏర్పడే పరిణామాలను ఏవిధంగా ఎదుర్కోవాలనే అంశాలపైనే భరద్వాజ పరిశోధన కొనసాగించారు. ఈ పరిశోధనలన్నింటినీ విశ్లేషణ చేసిన యూనివర్సిటీ ఆయన్ను ప్రత్యేకంగా గుర్తించి డాక్టరేట్‌ను అందజేసింది.

ఈ డాక్టరేట్‌ (Doctorate)ను స్ఫూర్తిగా తీసుకుని పోస్ట్‌ డాక్టరేట్‌ కూడా చేయనున్నట్లు భరద్వాజ తెలిపారు. విశ్వంలో మానవ మేధతో కాకుండా కృత్రిమ పరిజ్ఞానం (ఏఐ)పై పోస్టు డాక్టరేట్‌ పరిశోధనలు చేయనున్నట్లు భరద్వాజ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. విశ్వమండలంపై పరిశోధనలు చేస్తున్న భరద్వాజకు ‘నాసా’ ఉపకార వేతనం అందించనుంది.

ఖగోళ భౌతిక శాస్త్రం (Astrophysics)లో యూఎంకేఎస్‌ యూనివర్సిటీ నుంచి మొట్టమొదటి డాక్టరేట్‌ సాధించడం పట్ల భరద్వాజ సంతోషం వెలిబుచ్చారు. ఇది తనకెంతో గర్వకారణమన్నారు. ప్రొఫెసర్స్‌ డానియల్‌ మాకింటోస్చ్‌, మార్క్‌ బ్రాడ్‌విన్‌ల పర్యవేక్షణలో తాను పొందిన శిక్షణ ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. పరిశోధనల సమయంలో సుమారు ఎనిమిది సంస్థల నుంచి ఉపకారవేతనాలు వచ్చాయన్నారు. 2018లో అమెరికన్‌ అస్ట్రోనామికల్‌ సొసైటీ వారు బంగారు పతకం బహూకరించారని భరద్వాజ తెలిపారు. పోస్టు డాక్టరేట్‌ సాధించిన తరువాత భారతదేశానికి తిరిగివచ్చి ఇక్కడి విద్యార్థులకు భౌతికశాస్త్రం మీద ఆసక్తి తీసుకురావడంతోపాటు వారితో అనేక పరిశోధనలు చేయించాలనేది తన కోరికని వివరించారు.

ఇదీ చదవండి: 'రోడ్డుపై గుంత కనిపిస్తే ఆయన ఆగలేరు... వెంట వెళ్లకుండా నేనూ ఉండలేను'

Last Updated : Jul 21, 2021, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details