ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ డ్లో దేశవ్యాప్తంగా 43,204 మంది అర్హత సాధించారు. మహారాష్ట్రకు చెందిన చిరాగ్ ఫాలర్ 396 మార్కుల్లో 352 సాధించి.. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. బాలికల విభాగంలో కనిష్క మిత్తల్ 315 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది రెండున్నర లక్షల మందికి అర్హత ఉన్నప్పటికీ.. 1,50,838 మంది మాత్రమే జేఈఈ అడ్వాన్స్ డ్ రాశారు. అర్హత సాధించిన వారిలో అబ్బాయిలు 36,497, అమ్మాయిలు 6,707 మంది కాగా.. దివ్యాంగులు 436 ఉన్నారు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో 13,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు
తెలుగు విద్యార్థులు ఈ ఏడాది కూడా ప్రతిభను ప్రదర్శించారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్ రెడ్డి జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించడంతో.. దేశంలో ఈడబ్ల్యూఎస్ కోటాలో అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. విజయనగరం జిల్లాకు చెందిన ఎల్.జితేంద్ర జాతీయ స్థాయిలో 14వ ర్యాంకుతో ఓబీసీ విభాగంలో మొదటి స్థానం సాధించాడు. దివ్యాంగుల విభాగంలో కందుకూరి సునీల్ కుమార్ విశ్వేష్కు మొదటి ర్యాంకు దక్కింది.