తెలంగాణ

telangana

By

Published : Sep 13, 2020, 8:37 PM IST

Updated : Sep 13, 2020, 8:59 PM IST

ETV Bharat / city

ఈ నెల 15న తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం

అంతర్​ రాష్ట్ర ఆర్టీసీ సర్వీసుల చర్చలు మూడు అడుగులు ముందుకు... ఆరు అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతున్నాయి. రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు... ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమైనా కొలిక్కి రాలేదు. ముచ్చటగా మూడోసారి ఈ నెల 15న సమావేశం కానున్నారు.

ఈ నెల 15న తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం
ఈ నెల 15న తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం

లాక్​డౌన్​తో సుమారు 5 నెలలుగా అంతరాష్ట్ర ఆర్టీసీ సర్వీసులకు బ్రేక్ పడింది. మార్చి 22న ఆగిపోయిన అంతరాష్ట్ర సర్వీసులు తిరిగి ప్రారంభం కాలేదు. రాష్ట్ర సర్వీసుల ఒప్పందంపై విస్తృతంగా చర్చలు జరిగినా... అవి కొలిక్కి మాత్రం రావడం లేదు. 50 కిలోమీటర్ల దూరం ఒప్పందం వద్దనే సమావేశాలకు బ్రేక్ పడుతోంది. తెలంగాణ ఆర్టీసీ బస్సులతో పోల్చితే ఏపీ బస్సులు అదనంగా 1.12 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఆ అదనపు కిలోమీటర్లు తగ్గించుకోవాలని ఇటీవల హైదరాబాద్​లోని బస్ భవన్​లో జరిగిన ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశంలో ఏపీ అధికారులకు తెలంగాణ అధికారులు సూచించారు. కానీ... వారు మాత్రం 55 కిలో మీటర్లు మాత్రమే తగ్గించుకుంటామని... మిగిలిన 50 కిలో మీటర్లు తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిప్పుకోవచ్చని తెలిపారు. దీంతో మరో వారం తర్వాత సమావేశం నిర్వహించుకుందామని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు.

సమన్యాయం ఉండాలి..!

ఈ నెల 15న ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు హైదరాబాద్​లోని బస్ భవన్​లో మరోమారు సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏపీ 2.64 లక్షల కిలో మీటర్లు తిప్పుతోంది. అదే విధంగా ఏపీలో తెలంగాణ 1.52లక్షల కిలో మీటర్లు తిప్పుతోంది. తెలంగాణ కంటే ఏపీ అదనంగా 1.12 లక్షల కిలో మీటర్లు తిప్పుతోంది. గతంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమీక్షా సమావేశంలో అంతర్​ రాష్ట్ర ఆర్టీసీ సర్వీసుల నిర్వహణలో సమన్యాయం పాటించాలని సూచించారు. ఏపీ ఎన్ని కిలోమీటర్లు తెలంగాణలో తిప్పితే... అన్ని కిలో మీటర్లు తెలంగాణ బస్సులు ఏపీలో తిప్పాలి కానీ... ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశంలో ఈ అంశం కొలిక్కి రాలేదు. గతంలో ఏపీలో, ఇటీవల హైదరాబాద్​లో... మళ్లీ ఈ నెల 15న ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం కావాలన్న నిర్ణయంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అధికారుల సమావేశం కొలిక్కివస్తేనే... ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల మధ్య సమావేశం జరుగనున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి:సోమవారం తెలుగు రాష్ట్రాల రవాణాశాఖ అధికారుల భేటీ

Last Updated : Sep 13, 2020, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details