తెలంగాణ

telangana

ETV Bharat / city

కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించని తెలుగు రాష్ట్రాలు - Jal Shakti minister about telugu states projects

Gajendra Singh Shekhawat : తెలుగు రాష్ట్రాలు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను ఇంతవరకూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించలేదని కేంద్ర జల్​శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. 2021 జులై 15న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కేఆర్‌ఎంబీ జ్యూరిస్‌డిక్షన్‌ నోటిఫికేషన్‌ ప్రకారం అందులో పేర్కొన్న షెడ్యూల్‌-2లోని సాగునీటి ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు తప్పనిసరిగా బోర్డుకు అప్పగించాలని తెలిపారు. కానీ రెండు రాష్ట్రాలు ఇప్పటి వరకూ ఆ ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ, యాజమాన్య బాధ్యతలేమీ అప్పగించలేదని పేర్కొన్నారు.

krishna board
krishna board

By

Published : Aug 2, 2022, 7:54 AM IST

Gajendra Singh Shekhawat : తెలుగు రాష్ట్రాలు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి అప్పగించాల్సి ఉన్నా ఇంతవరకూ ఆ పని చేయలేదని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై సోమవారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

‘2021 జులై 15న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కేఆర్‌ఎంబీ జ్యూరిస్‌డిక్షన్‌ నోటిఫికేషన్‌ ప్రకారం అందులో పేర్కొన్న షెడ్యూల్‌-2లోని సాగునీటి ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు తప్పనిసరిగా బోర్డుకు అప్పగించాలి. కానీ రెండు రాష్ట్రాలు ఇప్పటి వరకూ ఆ ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ, యాజమాన్య బాధ్యతలేమీ అప్పగించలేదు’ అని తెలిపారు.

కేఆర్‌ఎంబీ అనుమతి లేకుండా జల విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ కృష్ణా నీటిని ఉపయోగించుకుంటోందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ‘జల విద్యుదుత్పత్తికి తెలంగాణ కృష్ణా నీటిని వాడుకొంది. అయితే తమ ఉత్తర్వులను అనుసరించాలంటూ కేఆర్‌ఎంబీ తెలంగాణకు 2021 జూన్‌ 17, జులై 15, 16 తేదీల్లో లేఖలు రాసింది’ అని షెకావత్‌ చెప్పారు.

కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని మిగులు జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచేందుకు విధానాన్ని ఖరారు చేసే బాధ్యతను కృష్ణా బోర్డు ఆధ్వర్యంలోని రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీకి అప్పగించినట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే వరద నీటిని రాష్ట్ర కోటాలో చేర్చొద్దంటూ కేంద్ర జలసంఘం సాంకేతిక కమిటీ సిఫార్సు చేసిందా? అని రాజ్యసభలో సోమవారం వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

‘కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని ఉన్న ప్రధాన ప్రాజెక్టుల నుంచి వర్షాకాలంలో ప్రవహించే మిగులు జలాల క్రమబద్ధీకరణ కోసం కేంద్ర జల్‌శక్తి శాఖ కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాలూ అవసరమైన సమాచారం అందించకపోవడంతో ఆ కమిటీ తన బాధ్యతలను పూర్తి చేయలేకపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ, తెలంగాణలుగా విడిపోయినందున ఇప్పుడు కృష్ణా నీటిని ప్రాజెక్టుల వారీగా కేటాయించే బాధ్యతను కృష్ణా ట్రైబ్యునల్‌-2కు అప్పగించాం. వర్షాకాలంలో కృష్ణా ప్రధాన ప్రాజెక్టుల నుంచి వచ్చే మిగులు జలాలను క్రమబద్ధీకరించే అంశం కేఆర్‌ఎంబీ పరిశీలనలో ఉంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో 75% ఆధారిత ప్రవాహాన్ని (డిపెండబుల్‌ ఫ్లోస్‌) మించి వచ్చే మిగులు జలాలను రెండు రాష్ట్రాలకు ఎలా పంపిణీ చేయాలో చెప్పే బాధ్యతను కేఆర్‌ఎంబీ ఆధ్వర్యంలోని రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీకి అప్పగించాం’ అని బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు.

విశాఖపట్నంలో కేఆర్‌ఎంబీ కార్యాలయం.. కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని, ఇందుకోసం ఉచిత వసతి కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చెప్పినట్లు బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు. రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details