‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా విడుదల వాయిదా పడినా... అందులోని ఈ పాటకు మాత్రం ఇంకా హైప్ కొనసాగుతూనే ఉంది. బహుశా పాట మీద నమ్మకంతోనో ఏమోగానీ కేవలం లిరికల్‌గానే కాకుండా నిర్మాతలు పూర్తి వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో ముందే రిలీజ్ చేశారు. పల్లెటూరి అమాయకపు ప్రేమకథగా ఈ గీతం సాగిన విధానం, చిత్రీకరించిన తీరుకు కుర్రకారు ఫిదా అయ్యారు. అందుకే 16 కోట్ల మందిపైగా చూసేశారు. ఇంకా సినిమా రిలీజ్ కాకుండానే ఈ పాట ఇంత అదరగొట్టేస్తుంటే... సినిమాతోపాటు రిలీజై నెట్టింట్లో దుమ్మురేపుతున్నాయి మరికొన్ని పాటలు. కోట్ల వ్యూస్ సొంతం చేసుకుని దూసుకుపోతున్న ఆ తెలుగు పాటలేంటో ఓ లుక్కేద్దామా!
బుట్టబొమ్మా...
ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అందులోని ‘బుట్ట బొమ్మా...’ పాట యూట్యూబ్ సెన్సేషన్ అయింది. 31కోట్లకుపైనే వీక్షణలు పొందిన ఈ పాట టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ వచ్చిన సాంగ్‌గా చరిత్ర సృష్టించింది. అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాట యూట్యూబ్‌తోపాటు మిగతా సామాజిక మాధ్యమాల్లోనూ యమా ఫేమస్ అయింది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం టిక్‌టాక్‌లో ఈ పాటకి స్టెప్పులేసి నెటిజన్లని
ఆకట్టుకున్నాడు.
రాములో రాములా...
దోశ స్టెప్ అనగానే గుర్తొచ్చేది అల్లు అర్జున్ వాయిస్ ఓవర్‌తో మొదలయ్యే ‘రాములో రాములా...’ పాట. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడిన ఈ పాట యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే 83 లక్షల వీక్షణలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం 29కోట్ల వ్యూస్‌తో రెండో స్థానంలో నిలిచిన ఈ పాట పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.