తెలంగాణ

telangana

ETV Bharat / city

CJI : 'అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్‌ను గౌరవించాలి'

CJI Justice NV Ramana in AP : తెలుగు భాష, సంస్కృతి, ఆత్మగౌరవం కోసం ధైర్యంగా పోరాడిన ఎన్టీఆర్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించేలా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆకాంక్షించారు. తెలుగు జాతికి ఎన్టీఆర్‌ తలమానికమన్నారు. ఆయనకు  గౌరవం దక్కితే యావత్‌ తెలుగు జాతికి లభించినట్లేనని చెప్పారు.

CJI Justice NV Ramana in AP
CJI Justice NV Ramana in AP

By

Published : Jun 10, 2022, 7:14 AM IST

CJI Justice NV Ramana in AP : తెలుగు ప్రజలు, వారికి నాయకత్వం వహిస్తున్న పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా.. తెలుగు భాష, సంస్కృతి, ఆత్మగౌరవం కోసం ధైర్యంగా పోరాడిన ఎన్టీఆర్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించేలా చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆకాంక్షించారు. తెలుగు జాతికి ఎన్టీఆర్‌ తలమానికమన్నారు. ఆయనకు గౌరవం దక్కితే యావత్‌ తెలుగు జాతికి లభించినట్లేనని చెప్పారు. పార్టీలు, జెండాలు, ఎజెండాలు ఏవైనా.. ఐక్యంగా మన భాషను, సంస్కృతిని కాపాడుకోకుంటే భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు.

ఎన్టీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా భాష, సంస్కృతి పరిరక్షణకు ఉద్యమించాలని జస్టిస్ ఎన్వీ రమణ ఉద్ఘాటించారు. సామాజిక మాధ్యమాలు, ఇతర సాధనాల ద్వారా ఏడాదిపాటు ఊరూవాడా తెలుగు భాష అభివృద్ధి కోసం ప్రచారం నిర్వహించాలని.. ఇదే ఎన్టీఆర్‌కు ఇచ్చే ఘనమైన నివాళి అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. గురువారం తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు గౌరవ పురస్కారాలను ప్రదానం చేశారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవ కమిటీ, నందనం అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

పదవి కోసం పార్టీ పెట్టలేదు..
‘ఎన్టీఆర్‌ ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. అంతే తప్ప ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో కావాలని పార్టీ పెట్టలేదు. ఇందిరాగాంధీ మరణం తర్వాత కాంగ్రెస్‌ ప్రభంజనంలోనూ ఎన్టీఆర్‌ ఎక్కువ పార్లమెంట్‌ స్థానాలు సాధించినా తెదేపాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఆయన రాజకీయ జీవితమిచ్చిన వారిలో ఎందరో జాతీయ, రాష్ట్రస్థాయిలో హోదాలు, పదవులు అనుభవించారు. ప్రతిపక్షానికి కేంద్రంలో గుర్తింపు తెచ్చి, దేశ రాజకీయాల్లో అవినీతిని ప్రక్షాళన చేసేందుకు పనిచేసిన వ్యక్తికి విపక్షాలు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదు. సినీ రంగంలోనూ ఆయనకు అవార్డులు ఇవ్వడంలో చిన్నచూపు చూశారు. తెలుగు జాతి ఐక్యంగా ఉండి ఆ గొప్ప నాయకుడికి అండగా నిలిస్తే.. ఆయనకే కాదు యావత్‌ తెలుగు జాతికి గౌరవం లభించి ఉండేది’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అభిప్రాయపడ్డారు. భాష, సంస్కృతి, ఆత్మగౌరవం విషయంలో తమిళుల పోరాటం నుంచి నేర్చుకోవాలని సూచించారు.

ఇంతటి సందిగ్ధత ఎప్పుడూ లేదు
‘ఎన్టీఆర్‌ గురించి ఏం మాట్లాడాలి.. ఎంతసేపు మాట్లాడాలి అనేది చిక్కు ప్రశ్న. నేను ఒక జడ్జిగా, ప్రధాన న్యాయమూర్తిగా కొంతమంది వ్యక్తులు, సమస్యల గురించి మాట్లాడాను. ఏనాడూ నాకు ఈ సందిగ్ధ పరిస్థితి ఎదురుకాలేదు. ఒక రైతు బిడ్డగా, రంగస్థల నటుడిగా, సమాజసేవకుడిగా, సినీ నటుడిగా, కుటుంబ పెద్దగా, కళాకారుడిగా, కళాకారులకు పెద్ద దిక్కుగా అనేక అంశాలను పుణికిపుచ్చుకున్న మహనీయుడు ఎన్టీఆర్‌’ అని చెప్పారు.

ఎన్టీఆర్‌తో సాన్నిహిత్యానికి గర్విస్తున్నా
‘1982లో తెదేపా ఆవిర్భావం నుంచి నేటి వరకు నాకు ఎన్టీఆర్‌ మనిషి అనే ముద్ర వేశారు. ఇందుకు గర్విస్తున్నా. 1983 ఎన్నికల్లో పరోక్షంగా పనిచేశా తప్ప పార్టీలో చేరలేదు. 1984లో ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచినప్పుడు పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు ప్రాణాలు అర్పించి ఎన్టీఆర్‌ను కాపాడుకున్నారు. 1988లో ఆయనపై ఒక అభూత కల్పనతో హైకోర్టులో కేసు వేశారు. అది న్యాయవ్యవస్థకు మచ్చ తెచ్చే కేసుగా మిగిలిపోయింది. ఒక ప్రధాన న్యాయమూర్తిగా దాని గురించి చర్చించడం సరికాదు. 1989లో ఓడిపోయిన దగ్గర నుంచి ఆయనకు మరింత దగ్గరయ్యా. పదవి పోయిన తర్వాత ఎవరూ రారని నాడు తెలుసుకున్నా. ప్రత్యక్షంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకపోయినా ఆయన్ను దగ్గర నుంచి చూస్తుంటే సంతోషం కలిగేది.

నన్ను నాన్నా అని పిలిచేవారు..
‘నా ఉద్యోగ విరమణ తర్వాత ఒక పుస్తకం రాస్తా. అందులో నాకు, ఎన్టీఆర్‌కు మధ్య ఉన్న సంబంధాలే కాకుండా ప్రజల గురించి ఆయన ఏం ఆలోచించేవారు. ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలనే తపనతో ఉండేవారో వివరిస్తా. ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తా. ఎన్టీఆర్‌ ఒకసారి నన్ను ఇంటికి రమ్మంటే వెళ్లాను. రా నాన్నా అని పక్కన కూర్చోబెట్టుకున్నారు. నేనంటే ఎంతో అభిమానం చూపించేవారు. ఎవరూ లేనప్పుడు నన్ను నాన్నా అనేవారు. ఆయనకు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అనేక న్యాయపరమైన విషయాల్లో సలహాలు ఇచ్చా’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఎన్టీఆర్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details