తెలంగాణ

telangana

ETV Bharat / city

చిన్నపిల్లలను రాజకీయాల్లోకి లాగడమేంటి.?: తీన్మార్​ మల్లన్నపై భగ్గుమన్న తెరాస ​ - ktr on bjp and teenmar mallanna

TRS Fires on Teenmar Mallanna: మంత్రి కేటీఆర్​ కుమారుడిపై భాజపా నేత తీన్మార్​ మల్లన్న అభ్యంతరకర వ్యాఖ్యలను మంత్రులు, తెరాస నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. చిన్నపిల్లలను రాజకీయాల్లోకి లాగి కించపరచడమేంటని హరీశ్‌రావు ప్రశ్నించగా... గులాబీ కార్యకర్తలు సహనం కోల్పోతే పరిస్థితేంటని పువ్వాడ అజయ్‌ ఆక్షేపించారు. భాజపా విష సంస్కృతిలో భాగమే ఇలాంటి భాషాప్రయోగమని బాల్క సుమన్‌ విమర్శించారు.

TRS Fired on Teenmar Mallanna
తీన్మార్​ మల్లన్నపై తెరాస ఫైర్​

By

Published : Dec 25, 2021, 8:04 PM IST

కేటీఆర్‌ కుమారుడిపై తీన్మార్​ మల్లన్న వ్యాఖ్యలను ఖండించిన తెరాస

TRS Fires on Teenmar Mallanna: భాజపా నేత చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్న తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడంపై మంత్రి కేటీఆర్​.. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్వీట్‌ చేశారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా కుటుంబ సభ్యులనుద్దేశించి తామూ స్పందిస్తే ఊరుకుంటారా అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలోని కమలం నేతలకు ఇదే నేర్పిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. తీన్మార్‌ మల్లన్న యూట్యూబ్‌ చానల్‌లో నిర్వహించిన ఓ పోల్‌లో తన కుమారుడిపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడంపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెదిరేది లేదు

కేటీఆర్‌కు సోదరి కవితతో పాటు వైతెపా అధ్యక్షురాలు షర్మిల మద్దతు పలికారు. రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను లాగి కించపరచడం.. దుష్ప్రచారం చేసేలా సామాజిక మాధ్యమాలను వినియోగించడం భాజపాకు.... బాగా తెలిసిన విద్యగా ఆర్థికమంత్రి హరీశ్ రావు ఆక్షేపించారు. భాజపా నేతలపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్​పై స్పందించిన హరీశ్.. భాజపా తన ప్రజా వ్యతిరేక చర్యలతో తెరాసను అడ్డుకోవాలనుకుంటే పొరపాటేనని తేల్చిచెప్పారు. ఎవరకీ బెదరబోమన్న హరీశ్... రాతిగోడ తరహాలో ఎవరూ బద్ధలు కొట్టలేనంత దృఢంగా తెరాస ఉందని స్పష్టం చేశారు.

అందుకే సహనంతో ఉన్నాం

చిన్న పిల్లలపై కొందరు అత్యంత నీచంగా మాట్లాడుతున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్​ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సహనంతో ఉన్నామన్న మంత్రి.. కార్యకర్తల ఆవేశం కట్టలు తెంచుకుంటే పరిస్థితి ఏంటని వ్యాఖ్యానించారు.

రాజకీయాలను కలుషితం చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది భాజపా మాత్రమే. భాజపా ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి.. ఎటువంటి వ్యక్తులను పార్టీలోకి తీసుకున్నామని ఆలోచించాలి. ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టే సహనంతో ఉన్నాం. -పువ్వాడ అజయ్​ కుమార్​, రవాణా శాఖ మంత్రి

ప్రజలు గమనించాలి

తెలంగాణ సమాజం.. భాజపా ఉపయోగించే భాష, వారి తీరును గమనించాలని ప్రభుత్వ విప్ బాల్క సమన్ ప్రజలకు సూచించారు. భాజపా దుష్ప్రచారం చేస్తుంటే పోలీసులు ఎందుకు సుమోటోగా కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.

రాజకీయాల్లో ఉన్న వ్యక్తులుగా... కుటుంబసభ్యులను, మహిళలను, చిన్నపిల్లలను రాజకీయాల్లోకి లాగడం అనేది సరైంది కాదు. ఇది దుర్మార్గమైన చర్యగా మేం భావిస్తున్నాం. కాబట్టి నిన్న తెలంగాణ సమాజం కూడా అంతే స్పందించింది. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల వ్యక్తిత్వాల్ని దెబ్బతీయడం గానీ కించపరచడం, నకిలీ ఫొటోలు పెట్టడం ఇలాంటివి భాజపాకు కొట్టిన పిండి. భాజపా విష సంస్కృతిని తెలంగాణ ప్రజలు గమనించాలి. దీని వెనక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నారు.- - బాల్క సుమన్, ప్రభుత్వ విప్​

పోలీసు బందోబస్తు

Police complaint on Teenmar mallanna: తీన్మార్ మల్లన్నపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెరాస సామాజిక మాధ్యమాల కన్వీనర్ దినేష్‌.. హైదరాబాద్‌ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీన్మార్‌ మల్లన్న ఆందోళన చేస్తారనే సమాచారంతో తెరాస ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:తెలంగాణభవన్​ వద్ద పోలీసుల భారీ బందోబస్తు.. ఎందుకంటే..

ABOUT THE AUTHOR

...view details