MLC Elections Polling: ఐదు ఉమ్మడి జిల్లాల్లోని ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఆరు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 26 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ఐదు ఉమ్మడి జిల్లాల్లో 37 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరిగింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు కొవిడ్ నిబంధనల మధ్య పోలింగ్ జరిగింది.
ఉమ్మడి మెదక్ జిల్లా..
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 1026 ఓటర్లకు గానూ.. 1018 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా.. పోలింగ్ 99.22 శాతం నమోదైంది. జహీరాబాద్, నారాయణఖేడ్, తూప్రాన్, సిద్దిపేట పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం పోలింగ్ నమోదైంది. సీఎం కేసీఆర్ మినహా ఎక్స్ అఫిషియో సభ్యులందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1324 ఓటర్లు ఉండగా.. 1320 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తంగా 99.69 శాతం పోలింగ్ నమోదైంది. కరీంనగర్ జిల్లాలో 205 మంది ఓటర్లకు గానూ.. ఎంపీ బండి సంజయ్ మినహా.. అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంథనిలో 98 ఓట్లుండగా.. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మినహా.. అందరూ ఓటేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 201 మంది ఓటర్లుండగా.. 200 మంది ఓటేశారు. హుజూరాబాద్, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, హుస్నాబాద్ పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ నమోదైంది.