Harish Rao at NIMS :పేద ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. హైదరాబాద్ నిమ్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ల్యాబ్‌లు సహా పరికరాలను ప్రారంభించారు. ఆస్పత్రిలో కలియ తిరుగుతూ అన్నింటిని పరిశీలించారు. జన్యుపర వ్యాధుల విశ్లేషణ, గుర్తింపునకు సంబంధించిన సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. రోగులకు ఇబ్బంది కలగకుండా పడకల సంఖ్య పెంచతున్నామని హరీశ్ రావు వెల్లడించారు..
Harish Rao at NIMS Hospital: జన్యుపర వ్యాధుల విశ్లేషణ, గుర్తింపునకు నిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా ల్యాబ్ ఏర్పాటు చేశారు. బోన్ డెన్సిటో మీటర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మల్టీడిస్పిలినరీ రీసెర్చ్ యూనిట్‌ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. జీవనశైలి వ్యాధులపై ఈ యూనిట్‌లో పరిశోధనలు చేయనున్నట్లు తెలిపారు. నిమ్స్‌లో రూ.2.73 కోట్లతో న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్, రూ.40 లక్షలతో అత్యాధునిక న్యూరో ఎండోస్కోపీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
"నిమ్స్‌లో బెడ్ దొరకడం కష్టం. నిమ్స్‌ను మరింత బలోపేతం చేయడానికి అదనంగా 200 పడకలతో ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం 155 ఐసీయూ పడకలున్నాయి. జనవరి 15 నాటికి అదనంగా మరికొన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం ఆస్పత్రిలో 89 వెంటిలేటర్లు ఉన్నాయి అదనంగా మరో 120 తీసుకొస్తాం. రేడియోలజీ, బయో కెమిస్ట్రీ, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూరో సర్జరీ విభాగాల్లో మరికొన్ని పరికరాలు రావాల్సి ఉంది. వాటన్నింటికి దాదాపు 153 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. 18 కోట్ల రూపాయలతో రోబోటిక్ సర్జరీ మెషీన్ ఇవ్వాలని కోరారు. నిమ్స్‌లో ఆయా పరికరాల కోసం రూ.154 కోట్లు మంజూరు చేస్తున్నాం. పేదవారికి ఉచితంగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నాం. త్వరలోనే మరో 4 ఆస్పత్రులు హైదరాబాద్‌లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి."