Ramoji Film City Winter Carnival : పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్‌సిటీ లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్ సంబరాలకు ముస్తాబైంది. ఈ నెల 17వ తేదీ నుంచి జనవరి 30వ తేదీ వరకు కొనసాగే ఈ ఫెస్ట్‌లో పర్యాటకుల్లో శీతాకాలపు ఉత్సాహాన్ని నింపేందుకు ప్రత్యేక వినోదాలు, సరదా కార్యక్రమాలు, లైవ్‌షోలు, థ్రిల్లింగ్ రైడ్‌లు, ఆటలతోపాటు ఆబాలగోపాలాన్ని ఆకట్టుకొనే బర్డ్ పార్కు, బటర్‌ఫ్లై పార్కు, బాహుబలి సెట్‌లు.. ఇంకా మరెన్నో విశేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
కార్నివాల్ అనుభూతి సొంతం చేసుకొనేలా..
Ramoji Film City Timings : రామోజీ ఫిల్మ్‌సిటీలో 45 రోజులపాటు కొనసాగే ఈ వింటర్ ఫెస్ట్‌లో పర్యాటకులు ప్రత్యేక వినోదాలను, సాయంత్రం వేళ కార్నివాల్ పరేడ్‌ను ఆద్యంతం ఆస్వాదించేలా ఏర్పాట్లు చేశారు. డ్యాన్స్ ట్రూప్, స్టిల్ట్ వాకర్స్, జగ్లర్లు, తమాషా వేషధారణల్లో అలరించే కళాకారులు, మైమరపించే సంగీతం వెరిసి సందర్శకులను ఆనందతీరాలకు చేరుస్తాయి. మిరుమిట్లుగొలిపే విద్యుత్తు దీపాలతో అలంకరించిన ఫిల్మ్‌సిటీ గార్డెన్లు, మార్గాల మధ్య సాగే కార్నివాల్ పరేడ్‌లో పాల్గొని వినువీధుల్లో విహరించిన అనుభూతిని పొందవచ్చు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని హోటళ్లలో బస చేసి లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్‌ను మరింతగా ఆనందించేలా అవకాశం కల్పిస్తున్నారు. పర్యాటకులకు ఆకర్షణీయమైన ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.