Lokesh On HSBC: సబ్జెక్ట్ లేని సీఎం.. 3 రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. తెదేపా హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోందని ధ్వజమెత్తారు. 15 ఏళ్ల నుంచి ఉత్తరాంధ్ర యువతకు వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్‌ఎస్‌బీసీ మూతపడటం బాధాకరమని లోకేశ్ అన్నారు.
అసమర్థతకు నిదర్శనం
రాష్ట్ర ప్రభుత్వం నియంత నిర్ణయాలు, బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు నిశ్శబ్ధంగా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని లోకేశ్ మండిపడ్డారు. ఇప్పుడు విశాఖకే తలమానికంగా నిలిచిన హెచ్‌ఎస్‌బీసీ కూడా మూతపడటం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మూడు రాజధానుల పేరుతో చేసిన మోసం చాలు' అన్న లోకేశ్ విశాఖను దోచుకోవడం ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రస్తుతం ఉన్న కంపెనీలనైనా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోకుండా చూడాలని కోరారు.