Alternative crops in TS: ప్రత్యామ్నాయ పంటల విషయంలో మార్కెటింగ్ సమస్యే కీలకం కానుంది. కంది, పెసర, మినుము తదితర పంటల ఉత్పత్తిలో 25 శాతం మాత్రమే నాఫెడ్ (జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సంస్థ) ద్వారా కేంద్రం కొంటోంది. మిగిలిన 75 శాతంలో కొంత వ్యాపారస్థులకు అమ్ముకుంటారు. మరికొంతమేర రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పప్పుధాన్యాల సాగువిస్తీర్ణం తక్కువగా ఉండటంతో కొన్ని సందర్భాల్లో మాత్రమే మార్కెటింగ్ సమస్య వస్తోంది. ఇప్పుడు యాసంగిలో వరి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పప్పుధాన్యాల సాగు, ఉత్పత్తి, కొనుగోలును పరిశీలిస్తే కేంద్రం ఇక్కడి ఉత్పత్తిలో 25 శాతం మాత్రమే కొనడానికి ముందుకొస్తోంది. విదేశాల నుంచి దిగుబడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటోంది.
మూడింతలు పెరగనున్న విస్తీర్ణం
యాసంగిలో ఆరుతడి పంటల సాగును ప్రత్యేకించి పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదాహరణకు శనగ గత ఏడాది 3.54 లక్షల ఎకరాల్లో సాగైతే, ఈ ఏడాది 10 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రతిపాదించారు. ఇదొక్కటే కాదు మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఆముదం తదితర పంటల సాగు పెరగనుంది. వీటన్నింటికీ మార్కెటింగ్ కీలకం కానుంది.
మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి
ప్రభుత్వ సూచన మేరకు ఈ యాసంగిలో వరికి బదులుగా తొమ్మిదెకరాల్లో మినుము సాగు చేశా. పురుగు వస్తోంది. ఏం వేయాలో తెలియదు. సక్రమంగా చెప్పేవారు లేరు. ఈ పంటలకు వచ్చే తెగుళ్లు, పట్టే పురుగులపై రైతులకు అవగాహన కల్పించాలి. సబ్సిడీపై విత్తనాలు ఇవ్వడంతోపాటు ఎరువులు, పురుగు మందులు కూడా సరఫరా చేయాలి. -సాగి అజయ్‌రావు, రైతు, బూర్గుపల్లి, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా
ప్రభుత్వ మద్దతు అవసరం
ముగిసిన వానాకాలంలో తెలంగాణలో 7.59 లక్షల ఎకరాల్లో కంది సాగైనట్లు వ్యవసాయ శాఖ లెక్కకట్టింది. 4.60 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో 80,142 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు కేంద్రం అనుమతించింది. అంటే వచ్చే దిగుబడిలో 25 శాతం. మిగిలిన 2.65 లక్షల మెట్రిక్ టన్నులను రాష్ట్ర ప్రభుత్వం కొనాలి. లేదా రైతులు వ్యాపారులకు అమ్ముకోవాలి. కందికి ప్రకటించిన కనీస మద్దతు ధర రూ. 6,300. ఇంతకంటే ఎక్కువ వస్తే బయట అమ్ముకోవడానికి ఎలాంటి సమస్యా లేదు. ధర తగ్గితే ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనాలి. అయితే ఇప్పటివరకు కేంద్రం నిర్ణయించిన 80,142 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లే ప్రారంభం కాలేదు. ఇదేకాదు, పప్పుదినుసులు, నూనెగింజల పంటలన్నింటిదీ ఇదే పరిస్థితి.
విదేశాల నుంచే ఎక్కువ